Janasena: జనసేనలోకి రాజా సింగ్..? పవన్ గ్రీన్ సిగ్నల్??

తెలంగాణలో ఎన్డీఏ కూటమి బలపడాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో కొంతమంది నాయకులను ఇతర పార్టీల నుంచి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో కొంతమంది నాయకులు ఎన్డీఏ పార్టీల్లోకి జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల తెలుగుదేశం(TDP) పార్టీలోకి కొంతమంది నాయకులు వెళుతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా నేత ఎన్డీఏ లోని జనసేన పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే జనసేన అధిష్టానానికి సమాచారం కూడా పంపినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో జనసేన పార్టీ ఇప్పటివరకు ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయలేదు. 2028 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని భావిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీని కూడా కలుపుకొని వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఇప్పటికే టిడిపి తో ఈ విషయంలో అంగీకారానికి వచ్చిన బిజెపి.. జనసేన కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుతో పాటుగా పలు పదవులకు ఎంపిక పూర్తి చేస్తే.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ గురించి అలాగే స్థానిక సంస్థల గురించి ఓ నిర్ణయానికి రావచ్చు అని భావిస్తోంది. ఇలాంటి టైంలో రాజాసింగ్ జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం కావడం ఆసక్తిని రేపుతోంది. ఇటీవల రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆయన రెడీ అవ్వగా ఆ తర్వాత సీనియర్ నేతల నుంచి ఒత్తిడి రావడంతో వెనక్కు తగ్గారు.
ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి.. సైలెంట్ అయిపోయారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2018 ఎన్నికల్లో బిజెపి తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఇక 2023 ఎన్నికలకు ముందు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత బీజేపీ నేతలు.. రాజా సింగ్ బలమైన నాయకుడు కావడంతో సస్పెన్షన్ ఎత్తేశారు. దీంతో గోషామహల్ నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. హిందూ భావజాలాన్ని తీవ్రంగా అభిమానించే రాజసింగ్ జనసేన పార్టీలో చేరితే అది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు కచ్చితంగా తెలంగాణలో లాభం చేకూర్చే అంశమే అనేది రాజకీయ వర్గాల మాట. దూకుడు స్వభావం ఉన్న రాజాసింగ్ విమర్శలు చేసే విషయంలో కూడా కాస్త దూకుడు వైఖరి ప్రదర్శిస్తూ ఉంటారు. మరి ఆయన ఎప్పుడు జనసేన తీర్థం పుచ్చుకుంటారో చూడాలి. టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఆ తర్వాత బిజెపిలో జాయిన్ అయ్యారు. గోషా మహాల్ నియోజకవర్గంలో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసినా విజయం సాధించే సత్తా ఉన్న నాయకుడు కావడంతో పవన్ ఏం చేస్తారో చూడాలి.