Raja Singh: రాజా సింగ్ రాజీనామా వెనుక హైడ్రామా.. అసలేం జరిగిందంటే..!!

తెలంగాణ బీజేపీలో (Telangana BJP) గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) రాజీనామా సంచలనం సృష్టించింది. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్.రామచందర్ రావు (Ramachandra Rao) ఎంపిక కావడంతో రాజా సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను అధ్యక్ష పదవికి పోటీ చేయనివ్వలేదంటూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే రాజా సింగ్ రాజీనామా వెనుక ఏం జరిగిందో బీజేపీ వివరించింది.
గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజా సింగ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హిందుత్వ భావజాలానికి కట్టుబడిన రాజా సింగ్, తన వివాదాస్పద ప్రసంగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్.రామచందర్ రావును హైకమాండ్ ఎంపిక చేయడంతో రాజా సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తనను మాత్రమే కాకుండా, లక్షలాది కార్యకర్తలను, నాయకులను, ఓటర్లను నిరాశపరిచిందని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పార్టీ దిశానిర్దేశంపై సీరియస్ సందేహాలను లేవనెత్తుతోందని ఆయన ఆరోపించారు.
రాజా సింగ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆయన నామినేషన్ ప్రక్రియలో అడ్డంకులను ఎదుర్కొన్నారని ఆరోపించారు. పార్టీ ఎన్నికల నిబంధనల ప్రకారం, నామినేషన్ కోసం 10 మంది స్టేట్ కౌన్సిల్ సభ్యుల మద్దతు అవసరం. కానీ రాజా సింగ్ కేవలం ముగ్గురు సభ్యుల సంతకాలతోనే నామినేషన్ ఫారమ్ సమర్పించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి శోభా కరండ్లాజే, రాజా సింగ్‌ను 10 మంది సభ్యుల మద్దతుతో మరో ఫారమ్ సమర్పించాలని కోరారు. ఆయన అదనపు మద్దతు సేకరించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన తన మద్దతుదారులను బెదిరించారని, నామినేషన్ వేయనివ్వలేదని ఆరోపించారు.
బీజేపీ రాజా సింగ్ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆయన క్రమశిక్షణారాహిత్యం పరాకాష్ఠకు చేరిందని, పార్టీ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించింది. రాజా సింగ్ నామినేషన్ కోసం పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ పాటిల్‌తో చర్చించిన తర్వాత, నామినేషన్ ఫారమ్ అందజేసి అవకాశం కల్పించినట్లు పార్టీ పేర్కొంది. అయినప్పటికీ రాజా సింగ్ నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ సమర్పించలేకపోయారని, దీనిని అడ్డం పెట్టుకుని పార్టీపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ స్పష్టం చేసింది. పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని, రాజా సింగ్ అనేక సందర్భాల్లో క్రమశిక్షణను ఉల్లంఘించారని బీజేపీ పేర్కొంది. గతంలో 2022లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా సస్పెన్షన్‌కు గురైనప్పటికీ, 2023లో ఆయన సస్పెన్షన్ ఎత్తివేసి, ఎన్నికల్లో టికెట్ ఇచ్చినట్లు పార్టీ గుర్తు చేసింది. అయినప్పటికీ, రాజా సింగ్ ప్రధానమంత్రి, జాతీయ అధ్యక్షుల కార్యక్రమాలకు హాజరుకాకుండా, తనను తాను పార్టీ కంటే గొప్పగా భావిస్తున్నారని బీజేపీ విమర్శించింది.
రాజా సింగ్ తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి సమర్పించారు. ఈ లేఖలో ఆయన తన నిర్ణయం వ్యక్తిగత ఆశయాల కోసం కాదని, లక్షలాది కార్యకర్తల నిరాశను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వ భావజాలం, గోషామహల్ ప్రజల సేవకు తాను కట్టుబడి ఉంటానని, పార్టీ నుంచి వైదొలగినప్పటికీ హిందూ సమాజం కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్‌లను ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. తనను ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పించాలని రాజా సింగ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటే స్పీకర్‌కు నేరుగా లేఖ సమర్పించాలని బీజేపీ సూచించింది.
రాజా సింగ్ రాజీనామా తెలంగాణ బీజేపీలోని అంతర్గత సమస్యలను బహిర్గతం చేసింది. ఆయన రాజీనామా కేవలం అధ్యక్ష పదవి నియామకంపై అసంతృప్తి మాత్రమే కాదు, గత కొన్ని నెలలుగా పార్టీ నిర్ణయాలపై ఆయన వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని కూడా ప్రతిబింబిస్తుంది. ఈ రాజీనామా తెలంగాణలో బీజేపీ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.