Ponnam Prabhakar: రాజాసింగ్ రాజీనామాతో.. బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..!

తెలంగాణ బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై రాజకీయ దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసిందని, బీసీ వ్యతిరేక పార్టీ అని రుజువు చేసుకుందని మండిపడ్డారు. బీసీలలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, వారికి అధ్యక్ష పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బీజేపీ ఒక ఫ్యూడల్ పార్టీ అని, అది ఎప్పుడూ బీసీలకు న్యాయం చేయదని అన్నారు. అధ్యక్ష పదవికి బీసీ నేత నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆయన (Ponnam Prabhakar) మండిపడ్డారు. గతంలో బీసీ నాయకుడైన బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి, ఆ బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశంలో సామాజిక న్యాయం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పునరుద్ఘాటించారు.
రాజాసింగ్ రాజీనామాతో మరింత వేడి
మరోవైపు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) బీజేపీకి రాజీనామా చేయడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. పార్టీ (BJP) అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి అనుమతించకపోవడంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు రాజాసింగ్ ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపినట్లు ఆయన తెలిపారు.