Ponnam: ఈ విషయంలో కేంద్రానికి తెలంగాణనే రోల్ మోడల్ : పొన్నం ప్రభాకర్

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కృషి ఫలితమేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపినందుకు కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కులగణన చేసి ప్రామాణికంగా స్పష్టమైన లెక్కల్ని వెల్లడించిందని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎవరెన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్లే కేంద్రం జనగణన, కులగణన చేపడుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. చౌకబారు విమర్శలు చేసేవారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కులగణనను తాము ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ విజయశాంతి, కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, మధుయాష్కీ తదితరులు ఉన్నారు.