తెలంగాణలో పొలిటికల్ బాంబ్.. పొంగులేటి కామెంట్ కలకలం…?

మొన్నటివరకూ విమర్శలు నడిచాయి. నిన్నటి వరకూ వాగ్వాదాలు తీవ్రరూపు దాల్చాయి. విమర్శలులేవు.. వాగ్వాదాలు లేవు.. ఇక పొలిటికల్ బాంబులు పేలతాయంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకూ జరిగిన అన్ని అంశాలపైనా విచారణ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం… వాటన్నింటికి సంబంధించిన విచారణ కొలిక్కి వచ్చిందని పరోక్షంగానే చెబుతోంది. ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబు పేలుతుందంటూ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్టేట్‌మెంట్ .. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
అసలు ప్రభుత్వం ఏం చేయబోతోంది… శ్రీనివాస్ రెడ్డి చెబుతున్న ఆ బాంబు ఏంటనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఇది కచ్చితంగా కేసులు రిలేటెడ్‌గానే ఉంటుందని ఆయన ముందే చెప్పారు. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని వార్నింగ్ కూడా ఇచ్చారు. సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్దమయ్యాయంటూ లీకు కూడా ఇచ్చేశారు. ఇదంతా చట్టం పరిధిలోనే ఉంటుందని కక్ష సాధింపులు అనుకోవద్దని కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. విచారణ కూడా చేపట్టింది.
ఈ కేసుల్లో కొందరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది కూడా. విచారణలో వివిధ దశల్లో ఉన్న ఈ కేసుల విషయమే శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావించి ఉంటారని అంటున్నారు. ఈ కేసుల్లో ఇప్పటి వరకు విచారణలో వెలుగు చూసిన అంశాలను అరెస్టు అయిన వాళ్లు ఇచ్చిన సమాచారంతో ముఖ్యనేతల పేర్లు ఉంటాయనే అనుమానం బలపడుతోంది. అదే ఈ బాంబు అని అంటున్నారు. అయితే ఈ బాంబ్ పేలుడు ప్రభావం ఎంతవరకూ ఉంటుందన్నది రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే.. గత పాలనలోని అవకతవకలను పూర్తిగా అధ్యయనం చేసి, దాన్ని చట్టపరంగా నిరూపించడం ఎంతవరకూ సాధ్యమవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే కమిషన్లు ఇచ్చే రిపోర్టులను.. అవతలిపక్షం కోర్టుల్లో సవాల్ చేసే పరిస్థితి ఉంటుంది.మరి… ఇది ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.