తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి?

తెలంగాణ డీజీపీ జితేందర్ (DGP Jitender) ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనుండడంతో కొత్త పోలీస్ బాస్ ఎవరనేదానిపై ఆ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. కొత్త డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శివధర్ రెడ్డి (Shivdhar Reddy)ని నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) ను నియమించే అవకాశం ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డీజీ సీవీ ఆనంద్ (CV Anand ) ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా బదిలీ చేసి, ఆయన స్థానంలో అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) మహేశ్ భగవత్ (Mahesh Bhagwat) పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
హోం శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిగుప్తాను విజిలెన్స్‌కు, జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రాను హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, ఐజీ (పీ అండ్ ఎల్) ఎం.రమే్‌షతో పాటు మరికొందరు ముఖ్య అధికారులు, మూడు కమిషనరేట్ల పరిధిలో డీసీపీలు, పలువురు జిల్లా ఎస్పీలు, కమిషనర్లు బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో ఏ ఇద్దరు అధికారులు కలిసినా త్వరలో జరగబోయే బదిలీలు, పోస్టింగ్‌లపైనే చర్చించుకుంటూ ఊహాగానాలు చేస్తున్నారు.