Phone Tapping: ఫోన్ ట్యాపింగ్, అమిత్ షా ఎంటర్ అయితే సీన్ సితార్..?

తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ కు కూడా పాకడంతో ఇప్పుడు ఏ పరిణామాలు ఉంటాయి అనేది ఆసక్తిగా మారింది. వైసీపీ(YSRCP), బీఆర్ఎస్(BRS) అధికారంలో ఉన్న సమయంలో రెండు రాష్ట్రాలలోని రాజకీయ నాయకుల ఫోన్ లను పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేసారనే ఆరోపణలు వినిపించాయి. రాజకీయంగా ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టడానికి ఈ చర్యలకు దిగారు అనేది స్పష్టంగా అర్ధమైంది. బిజెపి నేతల ఫోన్ లను కూడా ట్యాపింగ్ చేసారనే ఆరోపణలు సైతం వినిపించాయి.
ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ కావడంతో సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. త్వరలోనే ఆయనను విచారణకు కూడా పిలిచే అవకాశాలు కనపడుతున్నాయి. కాంగ్రెస్ నేతల ఫోన్ లతో పాటుగా టీడీపీ కీలక నేతల ఫోన్ లు కూడా పెద్ద ఎత్తున ట్యాప్ అయ్యాయి. దీనితో ఈ వ్యవహారంలో కేంద్రం ఎంటర్ అయ్యే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కూడా విచారించే అవకాశాలు ఉండవచ్చు. అలాగే కవితను కూడా విచారణకు పిలవచ్చని పోలీస్ వర్గాలు అంటున్నాయి. జాతీయ దర్యాప్తు బృందం.. యెన్ఐఏ, ఢిల్లీ పోలీసు విభాగంలో కీలకంగా పని చేసే సిబిఐ దీనిపై విచారణ చేసే సంకేతాలు కనపడుతున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలే ప్రధాన దోషులుగా ఉండటంతో రాజకీయంగా కూడా ఆ పార్టీకి కేంద్రం రూపంలో దెబ్బ తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. లిక్కర్ కుంభకోణంలో కవిత ఇబ్బంది పడగా ఫోన్ ట్యాపింగ్ లో కేటిఆర్, కేసీఆర్ ఇబ్బంది పడవచ్చనే అభిప్రాయాలు బలంగా వినపడుతున్నాయి.
అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆయనను విచారించే సమయానికి సిబిఐ కేసును టేకప్ చేసే అవకాశాలు ఉండవచ్చు. ఆ సమయానికి సిబిఐ అధికారులకు కేంద్ర హోం శాఖ నుంచి ఆదేశాలు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఏపీలో ఎన్డియే ప్రభుత్వం ఉండటం, టీడీపీ, బిజెపి నేతల ఫోన్ లు ట్యాప్ కావడంతో.. కేంద్రమే విచారణ నిమిత్తం రంగంలోకి దిగడం ఖాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇది కాంగ్రెస్ కు అనుకూలంగా మారకుండా సైతం బిజెపి రాజకీయం చేయవచ్చు అంటున్నారు పరిశీలకులు. అటు తిరిగి ఇటు తిరిగి.. బీఆర్ఎస్ ను ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయమా అనేది ఇప్పుడు ఆ పార్టీ నాయకులను వెంటాడుతున్న భయం.