తెలంగాణను దివాలా తీయించింది బీఆర్‌ఎస్సే : కాంగ్రస్ నేత మహేశ్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్ పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేశారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. భయంకరమైన అక్రమాలు చేసి, రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్లదేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని మంచి పనులు చేస్తున్నా.. బీఆర్ఎస్ నేతలు మాత్రం అబద్ధాలు ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తుూ పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మంచి నిర్ణయాలకు ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ కేడర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'మనం చేసిన పనులను చెప్పుకోకపోతే వెనుకబడిపోతాం. బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది. ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాలి’ అని పేర్కొన్నారు.