Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun Arrest) వ్యవహారం ఏ రేంజ్ లో దుమారం రేపిందో అందరికీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Govt), తెలుగు సినీ పరిశ్రమకు (Telugu Cinema Industry) మధ్య వైరంగా ఈ ఎపిసోడ్ మారిపోయింది. దీని వెనుక కొన్ని శక్తులు ఉన్నాయని.. అందుకే అల్లు అర్జున్ ను అరెస్టు చేసే వరకూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెళ్లారని వార్తలొచ్చాయి. పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో వైరం వల్లే అల్లు అర్జున్ ఇబ్బందులు పడుతున్నారని కూడా కొంతమంది చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ అరెస్టును పవన్ కల్యాణ్ ఖండించకపోవడం.., జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా స్పందించకపోవడంతో పవన్ కల్యాణ్ వల్లే ఇదంతా జరిగిందని కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు తొలిసారి పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై స్పందించారు.
అల్లు అర్జున్ అరెస్టు జరిగిన రోజు చిరంజీవి (Chiranjeevi), నాగబాబు (Nagababu) ఆయన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను కలిశారు. మరుసటి రోజు అల్లు అర్జున్ బెయిల్ పై బయటికొచ్చేశారు. అనంతరం ఆయన చిరంజీవి, నాగబాబు ఇళ్లకు వెళ్లి కలిసి వచ్చారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ కల్యాణ్ ఎక్కడా రియాక్ట్ కాలేదు. ఎన్నికల సమయంలో వైసీపీ నేతకు అనుకూలంగా అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో పవన్ కల్యాణ్ తో గ్యాప్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతూనే వస్తోంది. ఈ ఎపిసోడ్ తర్వాత అంతా సర్దుమణుగుతుందని భావించారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం దీన్ని పట్టించుకోలేదు. పైగా పవన్ కల్యాణ్ చెప్పడం వల్లే రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్నారని బన్నీ ఫ్యాన్స్ ఆరోపించారు.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కల్యాణ్ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలివరకూ తెచ్చుకున్నారన్నారు. సంఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ సారీ చెప్పి ఉంటే బాగుండేదని.. సినిమా యూనిట్ కూడా ఆయనకు అండగా నిలబడి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదని చెప్పారు. అల్లు అర్జున్ వెళ్ళక పోయినా కనీసం చిత్ర యూనిట్ వెళ్లి ఉండాల్సిందన్నారు. బాధితుడి ఇంటికి వెళ్లి సారి చెప్పి ఉంటే బాగుండేదన్నారు. అలాగే.. అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపించిందని పవన్ కల్యాణ్ అన్నారు. రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇవ్వయకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో హీరోను ఒంటరిని చేశారన్నారు. అల్లు అర్జున్ కు సిబ్బంది చెప్పి ఉంటే బాగుండేదన్నారు. అలాగే ప్రభుత్వం కూడా కొంచెం సాఫ్ట్ గా వెళ్లి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా ఉన్నారన్నారు. పుష్ప 2 టికెట్ రేట్లు పెంచారని.. అలాగే బెనెఫిట్ షోలకు కూడా అనుమతిచ్చారని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిని తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్ కు రాంచరణ్, అల్లు అర్జున్ చిన్ననాటి నుంచే తెలుసన్నారు. పైగా.. అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత కూడాఅని చెప్పారు. ఈ ఘటనలో చర్యలు తీసుకోకపోతే రేవంత్ రెడ్డిపై ప్రజలు విమర్శలు చేసే అవకాశం ఉందన్నారు. అందుకే పరిస్థితులను బట్టి కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.