Pashamylaram: కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై హరీష్ రావుకు మంత్రి వివేక్ కౌంటర్

సంగారెడ్డిలోని పాశమైలారంలో (Pashamylaram) సిగాచి కెమికల్స్ పరిశ్రమలో (Sigachi Chemical Industry)) రియాక్టర్ పేలిన దుర్ఘటనలో 14 మంది మరణించగా, మరో 35 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు (Harish Rao).. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkataswamy) తీవ్రంగా ఖండించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి మదీనాగూడలోని ప్రణమ్, కాకతీయ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి వివేక్ పరామర్శించారు. గాయపడిన వారికి తక్షణమే ఆక్సిజన్ అవసరం ఉండటంతో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించామని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రథమ చికిత్స అనంతరం అపోలో ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు. ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయడం తగదని, బాధిత కుటుంబాలను ఓదార్చే ప్రయత్నం చేయాలని పరోక్షంగా హరీష్ రావుకు (Harish Rao) హితవు పలికారు.
కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్
అంతకుముందు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao).. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “పొరుగు రాష్ట్ర మీడియా సంస్థకు ఏదో అయ్యిందని.. డిప్యూటీ సీఎంతో సహా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు… క్షణాల్లో అక్కడ వాలిపోయారు. ఇవాళ పాశమైలారంలో ప్రమాదం జరిగి అమాయక కార్మికుల ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియక మరికొందరు కార్మికుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగి ఉన్నాయి. ఈ ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటుతోంటే అధికార పార్టీ నుంచి ఏ ఒక్కరు అటువైపు పోలేదు” అని ధ్వజమెత్తారు. “అంటే బడాబాబులు ముఖ్యం కానీ.. పేద కార్మికులను సర్కారు పట్టించుకోదా..?” అని ప్రశ్నించారు. ఏ ఒక్క కాంగ్రెస్ నేతకు ఇంత ప్రమాదం గురించి సమాచారం ఇంకా అందలేదా? క్షతగాత్రులను ఎందుకు కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించలేదని హరీష్ రావు (Harish Rao) నిలదీశారు.