Komatireddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోపం ఎవరిపైన..?
తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తన వివాదాస్పద వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో (Congress) కలకలం సృష్టిస్తున్నారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తనకు మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ (Congress high command) హామీ ఇచ్చిందంటూ.. తనకు అది ప్రయారిటీ కాదంటారు. అయితే మునుగోడు ప్రజలకోసం ఎందాకైనా వెళ్లేందుకు వేనకాడేది లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో సంబంధాలు, మంత్రి పదవి హామీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని బహిరంగంగా ప్రకటించారు. 2023 అక్టోబర్‌లో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన ఆయన, మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, తెలంగాణ కేబినెట్ విస్తరణలో (cabinet berth) ఆయనకు చోటు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్ఠానం చెప్పినా, నేను మునుగోడు ప్రజల కోసం ఇక్కడే పోటీ చేశాను. పదవి కోసం కాళ్లు పట్టుకోను, అవసరమైతే మళ్లీ రాజీనామా చేస్తా,” అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత కలకలానికి కారణమయ్యాయి.
రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన తాజా విమర్శలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. పదేళ్లు తానే ముఖ్యమంత్రినని రేవంత్ రెడ్డి చెప్పడం తప్పు అని ఆయన ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. అంతేకాక, సోషల్ మీడియా జర్నలిస్టులను రేవంత్ అవమానించారని ఆరోపిస్తూ, “సోషల్ మీడియాను గౌరవించాలి, అవమానించడం సరికాదు. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఉంటుంది,” అని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ విపక్షాలపై విమర్శలు చేయడం కంటే తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. మునుగోడు ప్రజల సంక్షేమం కోసం పోరాడతానని, అవసరమైతే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. “రైతుబంధు అందరికీ అందలేదు, కొందరికే వచ్చింది. సీఎం తప్పు మాట్లాడినా నిర్మొహమాటంగా చెబుతా,” అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ పార్టీలోని అసమ్మతి స్వరాన్ని మరింత బలపరిచాయి. సీనియర్ నేత జానారెడ్డిపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు. నా మంత్రి పదవిని అడ్డుకుంటున్నారు,” అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలోని సీనియర్ నాయకుల మధ్య ఉన్న సమస్యలను స్పష్టం చేశాయి. అయితే, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయాలుగా పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డి రాజకీయ జీవితం ఒడిదొడుకులతో నిండినది. 2009లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన ఆయన, 2022లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. అయితే, మునుగోడు ఉపఎన్నికల్లో ఓటమి తర్వాత 2023లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు ఆయన పదేపదే పేర్కొంటున్నారు. ఆయన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తుతం భువనగిరి ఎంపీగా, మంత్రిగా ఉండటం కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడానికి ఓ కారణం. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపించట్లేదు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారాయి. మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తే రేవంత్ రెడ్డి అడ్డుకునే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా హైకమాండ్ పరిధిలో పనిచేస్తాయి. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని మండి పడుతున్నారు. తనకు మంత్రిపదవి రాలేదనే బాధతో ఆయన ప్రభుత్వంపైన, హైకమాండ్ పైన విరుచుకు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.







