Konda Surekha: మంత్రి కొండా సురేఖపై పరువునష్టం కేసును.. ఉపసంహరించుకున్న సినీ నటుడు
తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, పరువునష్టం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పై దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం కేసును సినీహీరో నాగార్జున (Nagarjuna) ఉపసంహరించుకున్నారు. దీంతో విచారణను ముగిస్తూ నాంపల్లి ప్రత్యేక కోర్టు (Nampally Special Court) ఉత్తర్వులు జారీ చేసింది. కొండా సురేఖపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నాగార్జున గతేడాది న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
నాగ చైతన్య (Naga Chaitanya), సమంత విడాకులు, ఎన్ కన్వెన్షన్ విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని పిటిషన్లో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలకు విస్తృత ప్రచారం లభించిందని, ఆ వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు. అన్ని సామాజిక మాధ్యమాల్లో పరువునష్టం కలిగించే వీడియోలు వైరల్ కావడం బాధించిందని పేర్కొన్నారు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు మంత్రి సురేఖ బుధవారం రాత్రి ఎక్స్‌లో సందేశం ఉంచారు. తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తంచేస్తూ, వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఆమె క్షమాపణలను అంగీకరించిన నాగార్జున, పరువునష్టం కేసును ఉపసంహరించుకున్నారు.






