Ramachandra Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు..!!

తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్ష పదవికి సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు (N.Ramachandra Rao) పేరు ఖరారైంది. ఈ నియామకం తెలంగాణ బీజేపీలో (Telangana BJP) కొత్త శకానికి నాంది పలికనంది. ఎన్. రామచందర్ రావు తెలంగాణ బీజేపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామచందర్ రావు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (RSS) తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఆయన బీజేపీలో వివిధ స్థాయిలలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. గతంలో ఆయన శాసనమండలి సభ్యుడిగా (MLC) పనిచేశారు. రామచందర్ రావు బీజేపీ హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటూ, సామాజిక సమతౌల్యతను నిర్వహించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ కార్యకర్తలు, విద్యార్థి విభాగాలు, ఆర్‌ఎస్‌ఎస్ సహా అన్ని సంస్థలతో సమన్వయం చేసుకునే ఆయన సామర్థ్యం ఉంది. అందుకే ఆయన్ను ఈ పదవికి ఎంపిక చేసినట్లు బీజేపీ కేడర్ భావిస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక మంగళవారం జరగనుంది. ఆదివారం దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. సోమవారం నామినేషన్లకు తుది గడువు. రామచంద్రరావు పేరును అధిష్టానం పైనల్ చేయడంతో మరెవరూ నామినేషన్లు వేసే అవకాశం లేదు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా నామినేషన్ వేస్తే ఎన్నిక జరుగుతుంది. అయితే అది అసాధ్యం. బీజేపీ అధ్యక్ష పదవికోసం చాలా మంది పోటీ పడ్డారు. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, కె.లక్ష్మణ్, డీకె అరుణ వంటి ప్రముఖులు ఈ సీటు ఆశించారు. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో రామచందర్ రావు వైపే మొగ్గు చూపింది. పార్టీ అధిష్ఠానం రామచందర్ రావును నామినేషన్ దాఖలు చేయాలని ఆదేశించింది.
రామచందర్ రావు ఎన్నిక తెలంగాణ బీజేపీకి ఒక కీలక మలుపు. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి (Kishan Reddy) స్థానంలో రామచందర్ రావు బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డికి పని ఒత్తిడి అధికమైంది. పైగా సంస్థాగత ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నిక అనివార్యమైంది. అందుకే కొత్త అధ్యక్షుడిగా రామచంద్ర రావు పేరు ఖరారైంది. ఈ మార్పు పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలు, 2028 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించేందుకు వీలు కల్పిస్తుంది.
రామచందర్ రావు ఎన్నిక వెనుక ఆర్‌ఎస్‌ఎస్, పార్టీ సీనియర్ల మద్దతు కీలకం. ఈ నియమనం ద్వారా పార్టీ హిందుత్వ ఎజెండాను బలోపేతం చేయడంతో పాటు, సామాజిక సమతౌల్యతను కాపాడేందుకు ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు. అయితే, రామచంద్రరావు ఎన్నికపై కొంతమంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. కానీ అధిష్టానం నిర్ణయాన్ని ఎవరూ ధిక్కరించే అవకాశం లేదు.
రామచందర్ రావు ముందున్న సవాళ్లలో పార్టీలోని వివిధ వర్గాలను సమన్వయం చేయడం ప్రధానమైంది. అంతర్గత విభేదాలతో పార్టీ సతమతమవుతోంది. వాళ్లందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయాల్సి ఉంది. కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపడం చాలా ముఖ్యం. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో పోటీపడుతూ, బీజేపీని ఒక బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టడం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం. అదే సమయంలో, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వంటి రాబోయే ఎన్నికలలో విజయం సాధించడం కూడా కీలకం.