Mock drill: హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిసిన మాక్ డ్రిల్

భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రహోం శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో సివిల్ మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్‌లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జరిగిన ఈ మాక్ డ్రిల్ (Mock drill ) లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై అవగాహనకు మాక్ డ్రిల్ నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నిమిషాల పాటు సైరన్ మోగింది. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో సైరన్లు మోగాయి. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే పౌరులు పాటించాల్సిన నియమాలను ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) , ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) సిబ్బంది వివరించారు. నగరంలోని నాలుగు ప్రాంతాలు ( నానల్‌నగర్, కంచన్‌బాగ్, సికింద్రాబాద్ (Secunderabad), ఈసీఐఎల్, ఎన్‌ఎఫ్‌సీ) నుంచి కొనసాగిన మాక్ డ్రిల్‌ను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.
మాక్ డ్రిల్‌లో భాగంగా ఫైరింగ్ జరిగినట్లుగా శబ్దాలు వినబటం, కొందరు సంఘ విద్రోహ శక్తులు కాల్పులు జరుపుతుండటం, ఒక భవనంలోకి వెళ్లి కాల్పులు జరిపితే అక్కడ ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నట్లుగా దృశ్యాలను మాక్‌డ్రిల్‌లో ప్రదర్శించారు. డీఆర్‌డీఏ సమీపంలోని ఓ కాలనీలోని 24 అంతస్తుల భవనంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎలా సురక్షితంగా కాపాడాలనే అంశాన్ని వివరించారు. అక్కడ ఫైరింజన్లను మోహరించారు. మొత్తంగా 12 శాఖల అధికారుల సమన్వయంతో ఈ మాక్‌డ్రిల్ నిర్వహించారు. కాల్పుల్లో గాయపడిన వారిని తోటివారి సహాయంతో సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలనే అంశంపై అవగాహన కల్పించారు.