Kavitha: కవిత రాజీ…!? కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా ముగిసినట్లేనా..?

బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) కుటుంబంలో విభేదాలు తలెత్తాయన్న ఊహాగానాలు గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ కు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) రాసిన లేఖ లీక్ కావడం, ఆ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో అందరూ గ్యాప్ వచ్చిందని భావించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ కుటుంబంతో ఆమె సన్నిహితంగా మెలుగుతుండండతో ఆల్ ఈజ్ వెల్ అని అనుకుంటున్నారు. పైగా కేసీఆర్, కేటీఆర్ లకు వచ్చిన నోటీసులపై ఆమె స్పందించి వాళ్లకు అండగా నిలవడంతో అంతా సెట్ అయిపోయిందని భావిస్తున్నారు.
కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖ లీక్ కావడం బీఆర్ఎస్‌లో పెను సంచలనం సృష్టించింది. ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీని కేవలం రెండు నిమిషాలు మాత్రమే విమర్శించారని, కాంగ్రెస్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టారని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ విషయం బీఆర్ఎస్ బీజేపీతో (BJP) జట్టు కడుతుందనే అనుమానాలకు దారితీసిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కవిత ఈ లేఖలో కేసీఆర్‌ను “దేవుడు”గా, ఆయన చుట్టూ ఉన్న కొందరిని “దెయ్యాలు”గా పేర్కొనడం సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యలు కేటీఆర్‌ను ఉద్దేశించినవని, కవిత సోదరుడిపై విమర్శలు గుప్పించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. పైగా లేఖ లీక్ వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఈ లేఖ లీక్ వెనుక కేటీఆర్ వర్గం ఉందని, తనను రాజకీయంగా దెబ్బతీయడానికి ఇది కుట్ర అని ఆమె సూచనప్రాయంగా వ్యాఖ్యానించారు. ఈ వివాదం బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది.
ఈ వివాదాల మధ్య, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (KLIS)లో అవకతవకల ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కవిత తన తండ్రికి అండగా నిలిచారు. జూన్ 4న హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) బ్యానర్‌పై ఆమె ధర్నా నిర్వహించారు, ఈ నోటీసులను రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణించారు. కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసం తొమ్మిదేళ్లు పాలన చేశారని, ఇలాంటి నోటీసులు ఆయన వారసత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నమని కవిత ఆరోపించారు. పైగా కమిషన్ ముందు హాజరయ్యేరోజు ఆమె నేరుగా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లి కలిశారు. దీంతో కుటుంబంలో విభేదాలు తగ్గాయనే సంకేతంగా కొందరు భావించారు.
తాజాగా, ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో కేటీఆర్‌కు ఏసీబీ (ACB) నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలోనూ కవిత తన సోదరుడికి మద్దతుగా నిలిచారు. ఈ నోటీసులను రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించిన ఆమె, కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. ఈ సంఘటన కవిత, కేటీఆర్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు తగ్గాయనే సంకేతంగా కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ పరిణామాలను కొందరు రాజకీయ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. దెయ్యాలు ఇప్పుడు దేవతలయ్యాయా? అని సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు వేస్తున్నారు.