Kavitha – PK: పవన్ కల్యాణ్‌పై కవిత హాట్ కామెంట్స్.. జనసైనికుల ఫైర్..!!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆమె పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియన్ (politician) కాదన్నారు. అంతేకాక.. ఆయన అనుకోకుండా డిప్యూటీ సీఎం (Dy CM) అయ్యారని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు కవితపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ గతంలో చేగువేరా వంటి విప్లవకారుడిని ఆదర్శంగా చెప్పుకున్నారని.. కానీ ఇప్పుడు ఆయనే బీజేపీతో కలిసి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని కవిత అన్నారు. ఆయన రాజకీయ సిద్ధాంతాలలో స్థిరత్వం లేదని.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీతో (YCP) తప్ప అన్ని పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. పార్టీ పెట్టిన 15 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి, ఊహించని విధంగా డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రజల దురదృష్టం అని కవిత వ్యాఖ్యానించారు. కవిత వ్యాఖ్యలపై జనసైనికులు (Janasainiks) ఫుల్ ఫైర్ లో ఉన్నారు. బీఆర్ఎస్ (BRS) తన రాజకీయ ఉనికికోసం పవన్ కల్యాణ్ ను విమర్శిస్తోందని ఎద్దేవా చేశారు. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న జగన్ ను పొగిడి.. ఆయన్ను ఓడించిన పవన్ కల్యాణ్ ను విమర్శించడంతోనే కవిత ఉద్దేశం ఏంటో అర్థమవుతోందని చెప్తున్నారు.
జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ్‌ను ఒక నటుడిగానే కాక, ప్రజా సమస్యలపై పోరాడే రాజకీయ నాయకుడిగా గౌరవిస్తారు. 2014లో జనసేన స్థాపించినప్పటి నుంచి ఆయన పలు అంశాలపై పోరాటం చేశారు. 2019లో ఆ పార్టీ ఒక సీటుకే పరిమితమైంది. పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి వంద శాతం స్ట్రయిక్ రేట్ తో అధికారంలోకి వచ్చారు. దీన్ని బట్టి పవన్ కల్యాణ్ సత్తా ఏంటో అందరికీ తెలుసని జనసైనికులు చెప్తున్నారు. కానీ కవిత మాత్రం ఈ విజయాన్ని అనుకోకుండా వచ్చినదిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతో జనసైనికులు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన రాజకీయ సిద్ధాంతాలు స్థిరత్వం లేనివి అనడం, డిప్యూటీ సీఎం పదవిని దురదృష్టం అనడం వాళ్లకు అస్సలు నచ్చట్లేదు.
జనసేన, బీఆర్ఎస్ మధ్య ఎప్పుడూ పెద్దగా విభేదాలు లేవు. పైగా కేసీఆర్ అంటే పవన్ కల్యాణ్ చాలా గౌరవిస్తారు. ఆ పార్టీని ఆయన పెద్దగా విమర్శించిన సందర్భాలు కూడా లేవు. అయితే ఇప్పుడు కవిత వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య కొత్త శత్రుత్వానికి దారితీసేలా ఉన్నాయి. బీజేపీతో కలిసి జనసేన తెలంగాణలో కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే పవన్ కల్యాణ్ ను కవిత టార్గెట్ చేసుకుని ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే ఓడిపోయి కష్టాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ లాంటి మాస్ లీడర్ ను విమర్శించడం అంటే.. ఆయన అభిమానులను పార్టీ దూరం చేసుకున్నట్టే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.