Miss World: బుద్ధవనంలో సుందరీమణుల సందడి

ఆసియాలోనే అతిపెద్ద మహాస్తూపం ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న బుద్ధవనాన్ని సందర్శించి సుందరీమణులు ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. సాయం సంధ్యవేళ, విద్యుద్దీపాలతో అలంకరించిన ప్రాంగణంలో సందడి చేశారు. గౌతముడి మహాపాదుకలకు పుష్పాంజలి ఘటించి, మహాస్తూపంలో ధ్యానం చేశారు. జాతకవనంలో బుద్ధుడి జీవనక్రమాన్ని తెలిపే శిల్పాలను చూసి అచ్చెరువొందారు.
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి (Miss World )-2025 పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచ దేశాల భామలు బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని నల్గొండ (Nalgonda) జిల్లా నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) లోని బుద్ధవనం ప్రాజెక్టు (Buddhavanam Project)ను సందర్శించారు. 110కి పైగా దేశాల సుందరీమణులు పాల్గొంటున్న ఈ పోటీలు శనివారం ప్రారంభమైన తర్వాత ఏర్పాటు చేసిన మొదటి పర్యటన ఇది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక సంపదను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆసియా(Asia), ఓషియనా (Oceania) దేశాలకు 22 మంది భామాలు పాల్గొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ, నల్గొండ జిల్లా యంత్రాంగం జానపద, గిరిజన నృత్య కళాకారులతో వారికి సాదరణంగా స్వాగతం పలికింది.