Miss World : ఘనంగా బ్యూటీ విత్ ఏ పర్పస్ గాలా

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో మరో నలుగురు అందాల భామలు క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం దక్కించుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన బ్యూటీ విత్ ఏ పర్పస్ గాలా (Beauty with a Purpose Gala)లో 108 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొనగా అమెరికా-కరేబియన్ ఖండం నుంచి ప్యూర్టొరికో (Puerto Rico) , ఆఫ్రికా నుంచి ఉగాండా, యూరప్ నుంచి వేల్స్, ఆసియా -ఓషియానా నుంచి ఇండోనేసియా భామలు ముందడుగు వేశారు. ఇప్పటికే పదిమంది క్వార్టర్ ఫైనల్‌లో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్యూర్టొరికో సుందరి వలేరియా పేరేజ్ బధిరులు, క్యాన్సర్‌తో పోరాడుతున్న కుటుంబాల కోసం చేస్తున్న ప్రాజెక్ట్ గురించి వివరించి ఆకట్టుకున్నారు. ఉగాండా భామ నటాషా న్యోనోజీ ఆటీజంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను వివరించి మెప్పించారు.
మిస్ వేల్ మిల్లి మా ఆడమ్స్ అనారోగ్యంతో నిరాశకు గురవుతున్న యువత కోసం చేపడుతున్న ప్రాజెక్టుతో జడ్జిల మనసు దోచారు. మిస్ ఇండోనేసియా మోనికా కేజియా సెంబరింగ్ దేశంలో నీటి సమస్యతో సతమతమవుతున్న వారికి రక్షిత మంచి నీటిని అందిస్తున్న ప్రాజెక్ట్ వివరించి విజేతగా నిలిచారు. సుధారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మేఘా ఇంజినీరింగ్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ సుధారెడ్డి (Sudha Reddy) నివాసంలో బ్యూటీ విత్ ఏ పర్పస్ గాలా జరిగింది. మిస్ వరల్డ్ సంస్థ చైర్‌పర్సన్ జూలియా మోర్లే, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ (Jayesh Ranjan) , బరోడా సంస్థానం మహారాణి రాధికారాజే గైక్వాడ్, జమ్మూ కశ్మీర్‌కు చెందిన కున్యారాని రితూ అజాతశత్రు సింగ్, జోధ్‌పూర్ రాకుమారి కృష్ణ కుమారి, సాంగ్లి రాకుమారి పూజా పద్మరాజే పట్వర్దన్ పలువురు పాల్గొన్నట్లు తెలిపారు.