Ponguleti: అమరావతిపై పొంగులేటి కామెంట్స్.. టీడీపీ రివర్స్ ఎటాక్..!

రాష్ట్రం విడిపోయిన పదేళ్ల తర్వాత కూడా ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల తూటాలు మాత్రం పేలుతూనే ఉన్నాయి. ఏదో ఒక అంశంపై రెండు రాష్ట్రాల నేతల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఏపీ రాజధాని అమరావతిపై (Amaravati) చేసిన కామెంట్స్ మరోసారి రెండు రాష్ట్రాల నేతలకు పనిచెప్పాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రియల్ ఎస్టేట్ (Real Estate) రంగం అమరావతికి తరలిపోతోందంటూ వచ్చిన వార్తలను పొంగులేటి ఖండించారు. ఇటీవల వరదల (floods) నేపథ్యంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు ముందుకు రావట్లేదని.. అందరూ హైదరాబాద్ (Hyderabad), బెంగళూరుల్లో (Benguluru) పెట్టుబడులు పెడుతున్నారని పొంగులేటి అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
అమరావతిని తమ కలల రాజధానిగా భావిస్తోంది టీడీపీ (TDP). దాన్ని ప్రపంచలోనే అత్యంత అధునాతన రాజధానిగా తీర్చి దిద్దాలనుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే అత్యాధునిక సౌకర్యాలు అక్కడ కల్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వాటిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన కామెంట్స్ ను కూడా టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. పొంగులేటికి ఇంకా వైసీపీ వాసనలు పోయినట్లు లేవని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) విమర్శించారు. జగన్ తో స్నేహం ఇంకా కొనసాగుతున్నట్టుందని అభిప్రాయపడ్డారు. అమరావతికి వస్తున్న పెట్టుబడుల గురించి ఒకసారి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఆయన పొంగులేటికి సూచించారు.
పొంగులేటి శ్రీనివాస రెడ్డికి వైసీపీ అధినేత జగన్ (YS Jagan) తో సన్నిహిత సంబంధాలున్నాయి. వైసీపీ ద్వారానే పొంగులేటి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఖమ్మం నుంచి వైసీపీ (YSRCP) తరపున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి మంత్రిగా ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ శ్రేణులంతా రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్ కు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి.. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో టీడీపీ నేతలంతా కాంగ్రెస్ కోసం పనిచేశారు. పొంగులేటి, తుమ్మల తదితరులు టీడీపీ నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు.
పొంగులేటి గెలుపుకోసం పనిచేసిన టీడీపీని వ్యతిరేకిస్తూ ఆయన అమరావతిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం అమరావతిని దుయ్యబట్టాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలు సూచిస్తున్నారు. ఇది మున్ముందు తెలంగాణలో కాంగ్రెస్ (Congress) పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తాయని హెచ్చరిస్తున్నారు. గత పదేళ్లూ టీడీపీ అభిమానులంతా బీఆర్ఎస్ (BRS) వైపు ఉండేవారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అనగానే టీడీపీ కేడర్ అంతా ఆయనకు మూకుమ్మడిగా మద్దతిచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి లాంటి వాళ్లు ఇలా మాట్లాడకుండా ఉండింటే బాగుండేదని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.