ఆర్థికంగా నష్టపోయాం.. ఎఫ్ఆర్బీఎం పెంచండి : మంత్రి హరీశ్

కరోనా కారణంగా రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్ వల్ల తాము 4100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని ప్రకటించారు. 44 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్ పాల్గొన్నారు. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం పెంచాలని, కనీసంలో 4 నుంచి 5 శాతానికి పెంచాలని హరీశ్ సిఫార్సు చేశారు. దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక కార్యక్రమాలు పుంజుకుంటాయని, అందుకే త్వరగా ఎఫ్‌ఆర్‌బీఎం పెంచాలని కోరారు.
విదేశాల నుంచి వ్యాక్సిన్ తెప్పించండి : హరీశ్
కోవిడ్ చికిత్సకు సంబంధించిన మందులు, ఇతర సామాగ్రిపై జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన పన్నుల సిఫార్సుకు మంత్రి హరీశ్ తన మద్దతు పలికారు. అవసరాలకు తగినంతగా దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదని, దేశ అవసరాలను లెక్కలోకి తీసుకొని, విదేశాల నుంచి దిగుమతి అయినా చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఇలా దిగుమతులు చేసుకొని, ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు వ్యాక్సిన్ అందించాలని పేర్కొన్నారు.