MIM: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC elections) ఎంఐఎం(MIM) గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ (Mirza Riaz ul Hassan) విజయం సాధించారు. ఆయనకు 63 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు (Gautam Rao)కు 25 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మాత్రమే పోటీ చేశాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 22 ఏళ్ల తర్వాత ఎన్నిక జరిగింది. బీజేపీ అనూహ్యంగా అభ్యర్థిని బరిలో దింపడంతో ఈ ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 23న ఎన్నికల జరిగింది. ఇక్కడ మొత్తం 112 మది ఓటర్లు ఉన్నారు. అత్యధిక ఓట్లు ఎంఐఎంకు ఉండగా, తర్వాత స్థానంలో బీజేపీ (BJP) ఉంది. ఎంఐఎంకు 49 ఓట్లుండగా ఇతర పార్టీల మద్దతు లభించింది. మొత్తం ఓటర్లలో 81 మంది కార్పొరేటర్లు కాగా, 31 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు, ఎక్స్ ఆఫీషియో సభ్యుల్లో 9 మంది ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంఐఎం, బీఆర్‌ఎస్‌లకు ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓట్లు 9 చొప్పున ఉండగా, కాంగ్రెస్‌కు ఏడు, బీజేపీకి ఆరు ఉన్నాయి.