Maoist: మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ… అగ్రనేత మల్లోజుల లొంగుబాటు..

మహారాష్ట్రలో మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు (Mallojula Venugopal Rao) పోలీసుల ఎదుట లొంగిపోయారు. 60 మంది క్యాడర్ తో కలిసి గడ్చిరోలి పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు..సీపీఐ (మావోయిస్ట్) పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ అలియాస్ సోనుగా క్యాడర్ కు చిరపరిచయం. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల మల్లోజుల లేఖ విడుద చేసిన విషయం తెలిసిందే.
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ నిర్విరామంగా కొనసాగుతుంది. పోలీసులు అడవుల్లోకి చొచ్చుకెళ్లి మరీ మావోయిస్టులను వేటాడుతున్నారు. అడవుల్లో దాక్కున్న మావోయిస్టులను భద్రతాదళాలు ఎన్‌కౌంటర్ చేస్తున్నాయి. వరుస ఎన్‌కౌంటర్‌లతో వందలాదిగా మావోయిస్టులు చనిపోతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ రావు.. పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు.ఇకపై ఆయుధాలు పట్టనని, జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్లు చెప్పారు మల్లోజుల. ఛత్తీస్‌గఢ్‌తో సహా దేశంలోని ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని కేడర్.. ఆయన నిర్ణయానికి మద్దతు ప్రకటించాయి. ఈ తరుణంలో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఈ ఏడాది సెప్టెంబరులో ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని మల్లోజుల విడుదల చేసిన లేఖలో కీలక విషయాలు ప్రస్తావించారు. ‘ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు, ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నా. ఇంతటి నష్టానికి, ఇన్ని బలిదానాలకు దారితీసిన విప్లవోద్యమ బాధ్యతల్లో తాను ఎంత మాత్రం కొనసాగడానికి అర్హుడిని కాదని భావిస్తున్నా. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది. ఈ సమయంలో నా నిర్ణయం సరైంది కాకపోవచ్చు. కానీ పరిస్థితులు దీన్ని తప్పనిసరి చేశాయి. వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద, అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలి. ఉద్యమాన్ని నడిపించడానికి ప్రజల్లోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు’ అని పేర్కొన్నారు మల్లోజుల.