Mahesh Kumar Goud: కవితను కాపాడేందుకు బీజేపీకి కేటీఆర్ బానిసలా మారారు: మహేష్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు నుండి కాపాడటానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బీఆర్ఎస్ దాసోహమైందని తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కవిత కోసం బీజేపీకి బానిసలా కేటీఆర్ పనిచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సంఖ్యాబలం లేని బీజేపీ, బీఆర్ఎస్ మద్దతుతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ దొంగల ముఠా, తమ కేసుల నుండి తప్పించుకోవడానికి బీజేపీకి సహకరిస్తోందన్నారు. బీఆర్ఎస్ బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్న బీజేపీ.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ఉపయోగించుకుంటోందని ఆయన (Mahesh Kumar Goud) మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పాలకులు తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చారని, అందువల్ల నిధులు ఇవ్వకపోయినా బీజేపీని ప్రశ్నించలేకపోయారని ఆయన ఆరోపించారు. దీని ఫలితంగా రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆయన అన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు బీఆర్ఎస్ పదేళ్లపాటు మద్దతునిచ్చిందని ఆయన (Mahesh Kumar Goud) గుర్తు చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడం వారి అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.