KTR: కంచ గచ్చిబౌలి భూముల తాకట్టుపై KTR సంచలన ఆరోపణలు..!!

తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల తాకట్టు వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈ భూముల వ్యవహారంలో 10 వేల కోట్ల రూపాయల ఆర్థిక కుంభకోణం జరిగిందని ఆరోపించారు. దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఒక బీజేపీ ఎంపీ కీలక పాత్ర పోషించారని సంచలన ఆరోపణలు చేశారు. HCU సమీపంలోని కంచె గచ్చిబౌలిలో సుమారు 400 ఎకరాల భూమి చాలాకాలంగా వివాదాస్పదంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ భూమిని తెలంగాణ ప్రభుత్వం తాకట్టు పెట్టి, ప్రైవేట్ బ్యాంక్ నుంచి భారీ రుణం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది అటవీ భూమి కాబట్టి దీన్ని తాకట్టు పెట్టడం చట్టవిరుద్ధమని, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై HCU విద్యార్థులు, పర్యావరణవాదులు ఆందోళనలు చేపట్టారు. మరోవైపు కోర్టు కూడా ఈ భూమి క్రయవిక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని ICICI బ్యాంక్ కు తాకట్టు పెట్టి 10 వేల కోట్ల రూపాయల రుణం పొందిందని KTR చెప్తున్నారు. ఈ రుణం FRBM నిబంధనలను అతిక్రమించిందని, ఒక బ్రోకరేజ్ సంస్థ సహాయంతో ఈ ఒప్పందం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీజేపీ ఎంపీ కీలక పాత్ర పోషించారని, త్వరలోనే ఆ ఎంపీ పేరు కూడా వెల్లడిస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. కంచె గచ్చిబౌలి భూములు తెలంగాణ గ్రోత్ ఇన్‌స్టిట్యూట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) పరిధిలో లేనప్పటికీ, వాటిని తాకట్టు పెట్టడం ద్వారా రుణం పొందారనేది కేటీఆర్ ఆరోపణ. ఈ ఒప్పందంలో ఒక బీజేపీ ఎంపీ, ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ అనే సంస్థ సహాయంతో ఈ కుంభకోణం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఆరోపణలు నిరూపించేందుకు RBI, సెబీ, CBI సహా పలు సంస్థలకు లేఖలు రాయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందానికి ఇది సంకేతమన్నారు.
2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందని.. అందులో భాగంగానే KTR లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. HCU భూముల వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని చెప్పడం ద్వారా ఆ రెండు పార్టీలను KTR టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి, కేటీఆర్ మంచి దోస్త్ లని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అందుకే వాళ్లిద్దరూ చెన్నై మీటింగ్ కు కూడా వెళ్లారని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ మాత్రం కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మొత్తానికి HCU భూముల తాకట్టు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పేలా ఉంది.. కేటీఆర్ ఆరోపణలు కాంగ్రెస్, బీజేపీలను డిఫెన్స్ లో పడేశాయి. అయితే ఇది ప్రభుత్వ భూమే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో వాటిని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోవడం తప్పెలా అవుతుందనే వాళ్లు కూడా ఉన్నారు. కేటీఆర్ మాత్రం తమది కాని భూమిని TGIIC ఎలా తాకట్టు పెడుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఆయన ICICI బ్యాంకును కూడా దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.