KTR – Bandi: వరదల్లో ఆత్మీయ దృశ్యం

తెలంగాణలో భారీ వానలు (heavy rain) కురిసి, వరదలు (Floods) ముంచెత్తాయి. ముఖ్యంగా కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భయానక పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో 500 మి.మీ. వర్షం కురిసి, ఫ్లాష్ ఫ్లడ్స్‌కు దారితీసాయి. రోడ్లు మునిగిపోయాయి. ఇళ్లలోకి వరదనీరు చేరింది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) వెంటనే చర్యలు చేపట్టారు. హెలికాప్టర్‌లు ఏర్పాటు చేయించారు. అదే సమయంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) ఆ ప్రాంతానికి చేరుకుని, బండి సంజయ్‌ను కలిసి ప్రశంసించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాల్లో హుందాతనంపై చర్చకు దారి తీసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్లపీడనం వల్ల తెలంగాణలో భారీ వానలు కురిశాయి. కామారెడ్డి జిల్లాలో ఒక్కరోజులోనే 500 మి.మీ. వర్షం నమోదైనట్టు అంచనా. రాజంపేటలో మొదటి 8 గంటల్లో 136 మి.మీ., తర్వాత 363 మి.మీ. వర్షం కురిసింది. ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల పలువురు గల్లంతయ్యారు. కొంతమంది చిక్కుకుపోయారు. రోడ్లు మునిగిపోయి, రైల్వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం NDRF బృందాలను రంగంలోకి దించింది. మంత్రి సీతక్క కామారెడ్డి కలెక్టర్‌తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, తక్షణ రిలీఫ్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు వెంటనే రంగంలోకి దిగారు. సిరిసిల్లలో అప్పర్ మానేరు వద్ద చిక్కుకున్న ఐదుగురిలో ఒకరైన స్వామికి ఫోన్ చేసి భయపడకండి, పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. డ్రోన్ల ద్వారా ఆహారం అందించాలని ఆదేశించారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫోన్ చేసి ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌లను పంపించాలని కోరారు. రక్షణ మంత్రి వెంటనే స్పందించి హకీంపేట డిఫెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించి రిలీఫ్ పనుల్లో పాల్గొన్నాయి. వరదల్లో చిక్కుకున్న ఐదుగురినీ సురక్షితంగా బయటకు తెచ్చాయి.
సిరిసిల్ల వరద సహాయక చర్యల్లో బండి సంజయ్ నిమగ్నమయ్యారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న కేటీఆర్, బండి సంజయ్‌ను కలిసి పలకరించారు. ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు. బండి సంజయ్ హెలికాప్టర్‌లు ఏర్పాటు చేయించి, త్వరితగతిన రక్షణ చర్యలు తీసుకోవడాన్ని కేటీఆర్ ప్రశంసించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు శెభాష్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
సాధారణంగా వీళ్లిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటూ ఉంటారు. ఇటీవలే బండి సంజయ్, కేటీఆర్‌పై డిఫమేషన్ సూట్ వేస్తానని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, బండి సంజయ్‌పై కామెంట్లు చేసి, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ, వరదల సమయంలో రాజకీయ తేడాలను పక్కనపెట్టి, హుందాగా వ్యవహరించారు. ఈ దృశ్యం రాజకీయాల్లో సానుకూల మార్పును సూచిస్తోందని నెటిజన్లు అంటున్నారు. “రాజకీయాలు అంటే విమర్శలు మాత్రమే కాదు, ప్రజా సేవ కూడా” అనే కామెంట్లు వస్తున్నాయి.