Konda Murali: ‘మమ్మల్నే తొక్కేస్తున్నారు..’ కొండా మురళి సంచలన లేఖ..!

వరంగల్ కాంగ్రెస్ (Warangal Congress) లో విర్గవిభేదాల నేపథ్యంలో ఆ పార్టీ నేత కొండా మురళి (Konda Murali) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై పార్టీ క్రమశిక్షణా సంఘానికి (Congress disciplinary committee) అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా సంఘం కొండా మురళిని విచారణకు రావాలని ఆదేశించింది. ఇవాళ విచారణకు హాజరైన ఆయన.. తన వాదనను ఆరు పేజీల లేఖ రూపంలో తెలియజేశారు. ఇందులో అనేక అంశాలను పేర్కొన్నారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు తన కుటుంబాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తన ప్రస్థానంపై ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. వరంగల్ జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై వివరణ ఇచ్చారు. ఈ లేఖ ద్వారా కొండా మురళి, తన భార్య కొండా సురేఖపై (Konda Surekha) జిల్లాలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు..
2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకట్ రెడ్డి నేతృత్వంలో చేపట్టారని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యవహారాలను తాను పర్యవేక్షించానని కొండా మురళి పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో దళితులు, గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. “అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలన్నది నా సిద్ధాంతం. నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనది కూడా ఈ వర్గాలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే” అని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలైన వరంగల్, మహబూబాబాద్ నియోజకవర్గాలను ఒకదాన్ని ఎస్సీ, మరొకదాన్ని ఎస్టీ రిజర్వ్ డ్ స్థానాలుగా మార్చడంలో తన పాత్రను వెల్లడించారు.
ఈ పునర్విభజన ప్రక్రియలో కొందరు సీనియర్ నాయకులు తమ స్థానాలను కోల్పోయారు. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి, తాను సీటు కోల్పోవడానికి కొండా మురళి కారణమని ఆరోపిస్తూ రాజకీయాల నుంచి వైదొలగారు. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి అల్లుడైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉంటూ కొండా సురేఖపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కొండా మురళి ఆరోపించారు. తాజా పరిణామాలు చూస్తే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ కోపంతోనే వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు.
అలాగే, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో తిరుగుతూ కొండా సురేఖపై విమర్శలు చేస్తున్నారని, అయినప్పటికీ తాము ఎవరికీ ఇబ్బంది కలిగించలేదని కొండా మురళి స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో బస్వారాజు సారయ్య కొండా సురేఖ చేతిలో 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా గతంలో కొండా సురేఖతో పోటీ చేసి కేవలం 2 వేల ఓట్లతో ఓటమి చెందారని, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇప్పటివరకు ఒక్క ఎన్నికలో కూడా గెలవలేదని ఆయన విమర్శించారు. తాము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినప్పుడు 26 మంది కార్పొరేటర్లు తమ వెంట వచ్చారని, ఇది వరంగల్‌లో తమ రాజకీయ బలాన్ని చాటుతుందని పేర్కొన్నారు. “నేను బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాను. కొంతమంది నాయకుల్లా పదవిలో కొనసాగలేదు. భారతదేశంలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా గెలిచిన ఏకైక వ్యక్తిని నేను” అని ఆయన కొండా మురళి వెల్లడించారు.
చివరగా, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై తనకున్న అభిమానంతో స్వయంగా క్రమశిక్షణ కమిటీకి వచ్చి వివరణ ఇచ్చానని, ఎవరూ తనను పిలవలేదని కొండా మురళి స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇప్పుడు తమపై జిల్లా నేతల ఆరోపణలను ఖండిస్తూ కొండా మురళి ఇచ్చిన లేఖ మరిన్ని సంచలనాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. కొండా మురళి ఆరోపణలపై జిల్లా నేతలు ఎలా స్పందిస్తారు.. పార్టీ హైకమాండ్ ఎలాంటి చర్యలు చేపడుతుందనేది వేచి చూడాలి.