Kavitha: ఫోన్ ట్యాపింగ్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు.. BRSకు ఇబ్బందేనా..?

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ (phone tapping) వ్యవహారం ఇప్పటికే హాట్ టాపిక్ గా ఉంది. ఈ కేసు భారత రాష్ట్ర సమితి (BRS) నాయకత్వాన్ని ఇరుకున పెడుతూ, రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తన పీఏ రాజేశ్‌తో పాటు తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు కవిత అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్ (KCR) కు సంబంధం లేదని, కింది స్థాయి వాళ్లు చేసి ఉండొచ్చని అమె స్పష్టం చేశారు. పరోక్షంగా కేటీఆర్ (KTR) ను ఆమె అనుమానించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) అధికారులు అప్పటి ప్రతిపక్ష నాయకులు, న్యాయవాదులు, జడ్జీలు, విమర్శకులు, జర్నలిస్టులు, సినీ నటులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటివరకు పలువురు సీనియర్ పోలీసు అధికారులు అరెస్టయ్యారు. సుమారు 4,500 మంది ఫోన్లు 2022-2023 మధ్య ట్యాప్ అయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
కవిత ఇటీవలి ఇంటర్వ్యూలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించారు. ఇవిప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “మా కుటుంబంతో సన్నిహితంగా పనిచేసిన వ్యక్తులను విచారణకు పిలిచారు. నా తండ్రి కేసీఆర్ ఇంత చిన్న చర్యకు పాల్పడతారని నేను అనుకోను. కానీ, కిందిస్థాయి నాయకులు ఈ పని చేసి ఉండొచ్చు” అని కవిత అన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా కేటీఆర్‌పై అనుమానం సృష్టించేలా ఉన్నాయి. ఎందుకంటే అప్పటి ఐటీ మంత్రిగా కేటీఆర్ ఈ ఆపరేషన్‌లో ప్రమేయం ఉండొచ్చనే ఆరోపణలు ఉన్నాయి. కవిత తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు చెప్పడం ఈ కేసును కొత్త మలుపు తిప్పేలా ఉంది. ఆమె పీఏ రాజేశ్‌కు సంబంధించిన కాల్ డేటా రికార్డులు గతంలో అరెస్టయిన ప్రణీత్ రావు ఫోన్‌లో లభ్యమైనట్లు సిట్ వెల్లడించింది.
కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలను మరింత పెంచాయి. కవిత, కేటీఆర్ మధ్య సంబంధాలు గతంలోనే బెడిసికొట్టాయి. ఈ వ్యాఖ్యలతో అవి తారస్థాయికి చేరాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత వ్యాఖ్యలు పార్టీలోని కొందరు నాయకులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఈ ఆరోపణలను ఉపయోగించుకుని బీఆర్ఎస్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. 2004 నుంచి ఈ ఆరోపణలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులపై డిఫమేషన్ నోటీసులు జారీ చేస్తూ, ఈ ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు.
అయితే కవిత వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి. ఫోన్ ట్యాపింగ్ రుజువైతే రాజకీయంగా ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం. ఇప్పటికే కేటీఆర్, కవిత మధ్య విభేదాలతో పార్టీ పరువు బజారున పడింది. కవిత ఇంతటితో ఈ వ్యవహారానికి ముగింపు పలికేలా లేరు. మున్ముందు కూడా కేటీఆర్ పై పోరాటాన్ని ఉధృతం చేసేలా ఉన్నారు. ఇది బీఆర్ఎస్ కు పెద్ద సమస్యే అని చెప్పొచ్చు.