Kaleswaram Report: తెలంగాణలో కాళేశ్వరం రిపోర్ట్ ప్రకంపనలు..!

తెలంగాణలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సంచలనం కలిగిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) నిర్మాణంలో అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పి.సి.ఘోష్ ఇటీవలే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నివేదికలో పలు కీలక అంశాలున్నాయి. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ లను నిందితులుగా కమిషన్ తేల్చింది. ఇది రాజకీయ రచ్చ రాజేసింది. ఇది కాళేశ్వరం రిపోర్ట్ కాదని, కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ అని బీఆర్‌ఎస్ ఎద్దేవా చేసింది. అయితే కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం బాధ్యుతలపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇది రాజకీయ రచ్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.
కాళేశ్వరం కమిషన్ నేపథ్యం
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అతిపెద్ద సాగునీటి పథకం. దాదాపు లక్ష కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కీలక భాగాలు. అయితే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్‌లోని 20, 21 పిల్లర్లు కుంగిపోయారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు తలెత్తడంతో నిర్మాణ లోపాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యలను గుర్తించి, విజిలెన్స్ విభాగం ద్వారా ప్రాథమిక విచారణ చేయించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ) అధ్యయనంలో కూడా నిర్మాణ లోపాలు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో 2024 మార్చి 14న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, భారత మొదటి లోక్‌పాల్ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైంది. 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై లోతైన విచారణ జరిపింది జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్. 115 మంది సాక్షులను విచారించి, విజిలెన్స్, ఎన్‌డిఎస్‌ఎ నివేదికలను పరిశీలించింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ కూడా కమిషన్ విచారణకు హాజరై సమాధానాలు ఇచ్చారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేయడం, బ్యారేజీల నిర్మాణ నిర్ణయాలపై కేసీఆర్ వివరణ ఇచ్చారు. 2025 జులై 31న కమిషన్ తన తుది నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు సీల్డ్ కవర్‌లో అందజేసింది, ఆ తర్వాత అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరింది.
జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలో కీలక అంశాలు
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన 650-700 పేజీల నివేదికలో పలు కీలక అంశాలు ఉన్నాయి.
1. నిర్మాణ లోపాలు, అవకతవకలు: మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్లలో సీపేజీ సమస్యలకు నిర్మాణ లోపాలే కారణమని కమిషన్ తేల్చింది. ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు గుర్తించింది. నిపుణుల కమిటీ సిఫారసులను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టినట్లు నివేదిక పేర్కొంది.
2. బాధ్యుల గుర్తింపు: అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యత వహించారని నివేదిక తేల్చింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కూడా నిర్మాణ లోపాలకు బాధ్యుడని పేర్కొంది. ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తప్పుడు సమాచారం అందించారని ఆరోపించింది.
3. ఆర్థిక అవకతవకలు: తక్కువ ఖర్చుతో నిర్మించగలిగిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును వదిలి, లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినట్లు నివేదికలో పేర్కొన్నారు. భూపరీక్షలు నిర్వహించకుండా, ఇష్టానుసారంగా బ్యారేజీల స్థానాలు ఎంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
4. సిఫారసులు: కొందరు అధికారులు తప్పుడు సాక్ష్యాలు సమర్పించినట్లు గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. నిర్మాణ లోపాలను సరిచేసే మార్గాలను ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది.
నివేదికను అధ్యయనం చేసేందుకు ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటైంది, ఇది 60 పేజీల సంక్షిప్త నివేదికను కేబినెట్‌కు సమర్పించింది. ఈ సంక్షిప్త నివేదికలో కేసీఆర్ పేరు 32 సార్లు, హరీశ్ రావు పేరు 19 సార్లు, ఈటల రాజేందర్ పేరు 5 సార్లు ప్రస్తావించబడినట్లు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వం ఏం చేయబోతోంది?
కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అతిపెద్ద అవినీతి కుంభకోణంగా చిత్రీకరిస్తోంది. జస్టిస్ పి.సి.ఘోష్ నివేదిక సమర్పించిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అంచనా. దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి.
బీఆర్‌ఎస్, బీజేపీ ఆరోపణలు
బీఆర్‌ఎస్ పార్టీ జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను కాంగ్రెస్ రిపోర్ట్‌గా, ట్రాష్‌గా, రాజకీయ దురుద్దేశంతో కూడిన నివేదికగా ఎద్దేవా చేసింది. పి.సి.ఘోష్ నివేదిక సమర్పించిన తర్వాత దానిపై నాటి నీటిపారుల శాఖ మంత్రి హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ వైఖరిని వెల్లడిరచారు. నాడు చట్టప్రకారమే అన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలో భాగంగా ఈ విచారణ జరిగిందని ఆరోపించారు. 665 పేజీల నివేదికను 60 పేజీలకు కుదించడం, అసెంబ్లీలో పూర్తి నివేదికను ప్రవేశపెట్టకపోవడం వెనుక కాంగ్రెస్ బాగోతం ఉందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నర సంవత్సరాల్లో పూర్తి చేయడం నేరంగా చిత్రీకరించారని, నివేదికలో రాజకీయ వ్యాఖ్యలు చొప్పించారని ఆరోపించారు. నివేదిక చట్టపరమైన పరీక్షకు నిలబడదని, సెక్షన్ 8(బీ)ని ఉల్లంఘించినట్లు ‘‘సౌత్‌ఫస్ట్’’ కథనాన్ని ఉదహరించారు. బీజేపీ నాయకులు, ముఖ్యంగా ఈటల రాజేందర్, నివేదికలో తమపై చేసిన ఆరోపణలను ఖండిరచారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో క్యాబినెట్ సబ్-కమిటీ సిఫారసుల ఆధారంగానే నిర్ణయాలు తీసుకున్నట్లు, నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని వాదించారు. బీజేపీ ఈ విషయంలో స్పష్టమైన వైఖరిని వెల్లడిరచలేదు, కానీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ వివాదంగా దీనిని చిత్రీకరిస్తోంది.
కాళేశ్వరం కమిషన్ నివేదిక తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికను బీఆర్‌ఎస్ ప్రభుత్వ లోపాలను బయటపెట్టే అస్త్రంగా ఉపయోగిస్తుండగా, బీఆర్‌ఎస్ దానిని రాజకీయ కుట్రగా విమర్శిస్తోంది. బీజేపీ తటస్థ వైఖరితో ఈ వివాదాన్ని గమనిస్తోంది. నివేదిక ఆధారంగా తీసుకునే చర్యలు, అసెంబ్లీలో జరిగే చర్చలు తెలంగాణ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది.