Kaleshwaram Report: కాళేశ్వరం వైఫల్యానికి ఆ ముగ్గురే బాధ్యులు.. రిపోర్ట్ లో సంచలన అంశాలు..!

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (KLIS)లో జరిగిన అక్రమాలు, నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (KCR), నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao), ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో (Etela Rajendar) పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రాజెక్ట్ వైఫల్యానికి బాధ్యులని స్పష్టం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో డిజైన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఆపరేషన్, నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కమిషన్ గుర్తించింది.
650 పేజీలు, మూడు వాల్యూమ్‌లతో కూడిన ఈ నివేదిక ప్రకారం, కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ అక్రమాలకు బాధ్యులని తేలింది. ప్రాజెక్ట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ధరల సవరణ, కాంట్రాక్ట్ మార్పులు, ఫైనాన్షియల్ గ్యారెంటీలలో కేసీఆర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని నివేదిక పేర్కొంది. రివ్యూ సమావేశాల్లో ఆయన ఇచ్చిన ఆదేశాలు శాస్త్రీయ ప్రమాణాలను పక్కన పెట్టి, నిర్మాణ ప్రక్రియను దెబ్బతీశాయని కమిషన్ ఆరోపించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన నిపుణుల కమిటీ నివేదికను హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా విస్మరించారని, ఇది ప్రాజెక్ట్ వైఫల్యానికి ప్రధాన కారణమని కమిషన్ తేల్చింది.
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (KIPCL) బోర్డులో ఆర్థిక శాఖ ఉన్నప్పటికీ, ఆర్థిక బాధ్యతలను అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ విస్మరించారని నివేదిక విమర్శించింది. తెలంగాణ ఆర్థిక స్థితిని పరిరక్షించడంలో ఈటలకు చిత్తశుద్ధి, సమగ్రత లోపించినట్లు కమిషన్ గుర్తించింది. ప్రాజెక్ట్ ఖర్చు మొదట రూ.38,500 కోట్లుగా అంచనా వేయగా, ఇది రూ.1.10 లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో ఆర్థిక నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.
అప్పటి నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.కె.జోషి, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని ఆపగలిగిన నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టారని కమిషన్ ఆరోపించింది. ఈ నివేదికలో వేమనపల్లిలో బ్యారేజీ నిర్మాణం తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో పూర్తవుతుందని సూచించినప్పటికీ, దానిని విస్మరించారు. అలాగే, అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, కీలక ఫైళ్లను కేబినెట్ ముందు ప్రవేశపెట్టడంలో విఫలమై, వ్యాపార నియమాలను ఉల్లంఘించారని నివేదిక పేర్కొంది.
ఇంజనీరింగ్ విభాగంలోనూ తీవ్ర లోపాలున్నట్టు కమిషన్ గుర్తించింది. అప్పటి ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC) సి.మురళీధర్, CE బి.హరిరాం తదితరులు సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)కి తప్పుడు సమాచారం అందించారని, నిపుణుల కమిటీ నివేదికలను తొక్కిపెట్టారని కమిషన్ తేల్చింది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి సబ్‌స్టాన్షియల్, ఫైనల్ కంప్లీషన్ సర్టిఫికెట్లు జారీ చేయడం అక్రమమైనది, దురుద్దేశపూరితమైనది అని తేల్చింది. ఇవి కాంట్రాక్టర్లకు అనుకూలంగా జరిగాయని నివేదిక ఆరోపించింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నిర్మాణ నాణ్యత, డిజైన్ లోపాలు, మోడల్ స్టడీస్ లేకపోవడం, ధర్డ్ పార్టీ ధ్రువీకరణ లోపించడం, నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాలను కమిషన్ గుర్తించింది. బ్యారేజీలను నీటి నిల్వ కోసం ఉపయోగించడం, శాస్త్రీయంగా నీటిని డైవర్ట్ చేయడానికి బదులు నిరంతరం నీటిని నిల్వ చేయడం వల్ల నిర్మాణ ఒత్తిడి ఏర్పడిందని, ఇది బ్యారేజీలకు నష్టం కలిగించిందని నివేదిక స్పష్టం చేసింది.
ఈ నివేదిక సమర్పణతో, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రాజకీయ, పరిపాలనా లోపాలు, నిర్మాణ లోపాలు స్పష్టమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలను నిర్ణయించనుంది. ఇది రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది.