ACB: కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీని అదుపులోకి తీసుకున్న ఏసీబీ

కాళేశ్వరం నీటిపారుదల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భూక్యా హరిరామ్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారం మేరకు హైదరాబాద్‌లో 14 వేర్వేరు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే భారీగా అక్రమాస్తులను గుర్తించారు. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలైన శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నార్సింగిలలో ఆయన, ఆయన సన్నిహితుల పేర్ల మీద అనేక విల్లాలు, స్థలాలు ఉన్నట్లు నిర్ధారించారు. అంతేకాకుండా, అమరావతిలో ఒక పెద్ద వ్యాపార సముదాయం, మార్కుక్ మండలంలో విస్తారమైన వ్యవసాయ భూమిని కూడా హరిరామ్ కొనుగోలు చేసినట్లు ఏసీబీ (ACB) దర్యాప్తులో వెల్లడైంది. శ్రీనగర్ కాలనీలో ఒక విలాసవంతమైన గృహం, బొమ్మలరామారంలో ఒక విశాలమైన మామిడి తోటతో కూడిన ఫామ్‌హౌస్‌ను కూడా అధికారులు గుర్తించారు. ఈ సోదాల సందర్భంగా కీలకమైన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.