Anirudh Reddy: ‘ఆంధ్రోళ్లు మంచిగా చెప్తే వినరు..’ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే (Jadcherla MLA) అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy), ఆంధ్రోళ్లపై చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CM Chandrababu) కోవర్టులు తెలంగాణలో ఉన్నారని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాక ఆంధ్రోళ్లకు మంచిగా చెప్తే వినరని చెప్పారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారడమే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సున్నితమైన సమస్యలను మరింత జటిలం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కూడా అనిరుధ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగేలా పలుమార్లు వ్యవహరించారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. “మా దగ్గర చంద్రబాబు కోవర్టులు ఉన్నారు. వారు ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్‌లో దందాలు చేస్తున్నారు. వారి ఇళ్లకు నల్లా కనెక్షన్, కరెంట్ కనెక్షన్ కట్ చేస్తే, వాళ్లే చంద్రబాబు దగ్గరికి వెళ్లి బనకచర్లను ఆపమని అడుక్కుంటారు” అని వ్యాఖ్యానించారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు రచ్చ రాజేశాయి. అంతేకాకుండా “ఈ ఆంధ్రోళ్లకు మంచిగా చెప్తే వినరు” అని ఆయన చేసిన మరో వ్యాఖ్య రెండు రాష్ట్రాల మధ్య ఉన్న భావోద్వేగ సమస్యలను మరింత రెచ్చగొట్టింది.
అనిరుధ్ రెడ్డి గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తులపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యాయి. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లు అంగీకరించట్లేదంటూ గతంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే ఆంధ్రోళ్లను తెలంగాణలో తిరగనీయబోమని హెచ్చరించారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సున్నితమైన సమస్యలను రెచ్చగొట్టేలా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది.
జనంపల్లి అనిరుధ్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందారు. రాజకీయ నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. అయితే ఆయన వ్యాఖ్యలు పలు సందర్భాల్లో పార్టీని ఇరుకున పెట్టాయి. ఇప్పుడు తెలంగాణలోని ఆంధ్రా కాంట్రాక్టర్లను లక్ష్యంగా చేసుకుని అనిరుధ్ రెడ్డి కామెంట్స్ చేసినట్లు అర్థమవుతోంది. ఆంధ్రా కాంట్రాక్టర్లు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులు చేపడుతున్నారు. తెలంగాణలో కూడా పలు కాంట్రాక్టర్లను టెండర్ల ద్వారా దక్కించుకుని పనులు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్లను ఇబ్బంది పెట్టాలనేలా అనిరుధ్ రెడ్డి రెచ్చగొట్టడం సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అధిష్టానం ఈ వివాదంపై ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, గతంలో ఇలాంటి సంఘటనల సమయంలో పార్టీ నాయకత్వం అనిరుధ్ రెడ్డిని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న వేళ, ఇలాంటి వివాదాలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.