BRS: బీఆర్ఎస్ మళ్లీ ఆంధ్ర, చంద్రబాబు సెంటిమెంట్‌నే నమ్ముకుంటోందా..?

భారత్ రాష్ట్ర సమితి (BRS) మనుగడ తెలంగాణ సెంటిమంట్ పైనే ఉందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఉద్యమ పార్టీగా, తెలంగాణ కోసం ఆవిర్భవించిన పార్టీగా ఆ ప్రాంత ప్రయోజనాలకోసం ఆ పార్టీ పనిచేయడంలో తప్పులేదు. అయితే 11 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఆ పార్టీ సెంటిమెంట్ నే అస్త్రంగా మలుచుకుంటోంది. తమ రాజకీయ ప్రత్యర్థులపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) లక్ష్యంగా చేసుకుని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును (AP CM Chandrababu) బూచిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కేటీఆర్ (KTR), రేవంత్ రెడ్డిని చంద్రబాబు కోవర్ట్ గా అభివర్ణించారు. ఆ పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియా కూడా చంద్రబాబుపై నిత్యం విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది. దీంతో బీఆర్ఎస్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జరిగిన ఉద్యమంలో సెంటిమెంట్ రాజకీయాలను విజయవంతంగా ఉపయోగించింది. “ఆంధ్రోళ్లు” అనే సెంటిమెంట్‌ను రగిల్చి, తెలంగాణ ప్రజల మనోభావాలను ఏకతాటిపైకి తెచ్చింది. అయితే, రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో ఉండే వాళ్లంతా తమవాళ్లేనని, ఆంధ్రోళ్లకు ముల్లు గుచ్చుకుంటే నోటితో తీస్తానని కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. దీంతో ఆ పార్టీకి అండగా నిలిచారు ఆంధ్రా ప్రజలు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ మరోసారి ఆంధ్ర పాలకులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని, ఆ పార్టీ మనుగడ కోసమే ఇలా చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన సమయంలో, పాత వ్యూహాలను రిపీట్ చేస్తున్నట్లు కనిపిస్తోందని చెప్తున్నారు.
ఇటీవల బీఆర్ఎస్ నాయకులు చంద్రబాబును బూచిగా చిత్రీకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు సూచనల మేరకు పాలన సాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి, చంద్రబాబుతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందన్నారు. అటు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా చంద్రబాబుపై బురద జల్లుతోంది. రేవంత్ రెడ్డిని చంద్రబాబు అనుచరుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది.
అయితే బీఆర్ఎస్ వ్యూహాన్ని చిల్లర ప్రచారాలుగా అభివర్ణిస్తున్నారు కొంతమంది విశ్లేషకులు. పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారినప్పుడల్లా ఇలాంటి సెంటిమెంట్ రాజకీయాలకు పాల్పడడం బీఆర్ఎస్ కు అలవాటేనని చెప్తున్నారు. కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలను తెలంగాణ రాష్ట్రంపై ఆరోపణలుగా వక్రీకరించడం ద్వారా, బీఆర్ఎస్ తామే తెలంగాణ ప్రతినిధులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని వారు సూచిస్తున్నారు. కానీ తెలంగాణపై బీఆర్ఎస్ కు మాట్లాడే అర్హత లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. తమ స్వప్రయోజనాల కోసం తెలంగాణ పేరునే పార్టీ నుంచి తొలగించిన కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఈ సెంటిమెంట్ రాజకీయాలను గుర్తిస్తున్నారని, ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఇటువంటి వ్యూహాలకు కాలం చెల్లిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, పార్టీలో అంతర్గత విభేదాలు, కేసీఆర్ ఆరోగ్య సమస్యలు వంటివి పార్టీని రక్షణాత్మక స్థితిలోకి నెట్టాయి. అందుకే ఈ సెంటిమెంట్ రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయని వారు భావిస్తున్నారు.