Allu Arjun: BRS, YCP వల్లే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడా..?

అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun Arrest) వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించట్లేదు. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం కూడా రాజకీయ మలుపులు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కావాలనే అల్లు అర్జున్ ను అరెస్టు చేశారని కొంతమంది సోషల్ మీడియాలోనూ, బయటా మాట్లాడుతున్నారు. అయితే బీఆర్ఎస్ (BRS), వైసీపీకి (YCP) చెందిన నేతలు అల్లు అర్జున్ ను వెనకేసుకొస్తూ రేవంత్ రెడ్డిని తప్పుబడుతుండడం వల్లే ప్రభుత్వం ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే వాళ్లు కూడా ఉన్నారు. మొత్తంగా అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో రాజకీయ జోక్యం స్పష్టంగా కనిపిస్తోంది.
పుష్ప 2 (Pushpa 2) సినిమా ప్రివ్యూ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో (Sandhya theatre) తొక్కిసలాట (stampede) జరిగింది. ఈ తొక్కిసలాటకు అల్లు అర్జున్ కూడా కారణమేనని భావించి FIR నమోదు చేసింది. ఇందులో అల్లు అర్జున్ A13గా ఉన్నారు. కేసు విచారణలో భాగంగా నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అందులో భాగంగానే అల్లు అర్జున్ ను కూడా అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఒకరాత్రి అల్లు అర్జున్ జైల్లో గడిపి బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారానికి బీఆర్ఎస్, వైసీపీ లాంటి పార్టీలు రాజకీయ రంగులద్దాయి. ఇది ఇప్పుడు మరింత ముదిరి పాకాన పడింది.
సక్సెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లే అల్లు అర్జున్ ను అరెస్టు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ సీఎం ఎవరో కనీసం సెలబ్రిటీలకు కూడా తెలియడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. అటు వైసీపీ నేతలు కూడా అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి అరెస్టు చేశారని అంబటి రాంబాబు (Ambati Rambabu) ట్వీట్ చేశారు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ కు సంఘీభావంగా పోస్టులు పెట్టారు. తాము అల్లు అర్జున్ కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మొదట్లో అల్లు అర్జున్ ను బీఆర్ఎస్, వైసీపీ నేతలు అండగా నిలబడడాన్ని బన్నీ ఫ్యాన్స్ స్వాగతించారు. అయితే ఆ తర్వాత మేల్కొన్నారు. వీళ్ల వల్లే అల్లు అర్జున్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రహించారు. అందుకే మీ సపోర్ట్ ఇక చాలు.. ఆపండి ప్లీజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీ అంతా ఆ పార్టీతో రాసుకుపూసుకు తిరిగింది. ఇది సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి నచ్చదు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో సినీ ఇండస్ట్రీపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా మారలేదు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్, వైసీపీ లాంటి పార్టీల మద్దతుతో ఊరేగుతాం అనుకుంటే ఎలా అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే అల్లు అర్జున్ లాంటి హీరోను కూడా అరెస్టు చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి ఒక గట్టి సందేశం పంపించాలనుకుంది. ఇందుకు బీఆర్ఎస్, వైసీపీ వైఖరే కారణమని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. లేకుంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదంటున్నారు.