నాకు ఫామ్ హౌస్‌లు లేవు.. కాంగ్రెస్ లీడర్ల బిల్డింగులు కూడా కూల్చాలి: కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ నేతలకు మధ్య ఫైట్ జరుగుతోంది. దీనిలో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివసిస్తున్న ఒక ఫాంహౌస్‌ను అక్రమ కట్టడంగా తేల్చిన కాంగ్రెస్ సర్కారు.. దాన్ని కూల్చివేయాలని చూస్తోంది. అయితే జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని, తన మిత్రుడి ఫామ్ హౌస్‌ను లీజుకు తీసుకొని ఉంటున్నానని కేటీఆర్ చెప్పారు. ఈ భవనం కనుక ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండి ఉంటే తాను దగ్గరుండి మరీ దాన్ని కూల్చివేయిస్తానని, అదే సమయంలో కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయాలని కాంగ్రెస్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు.
‘నాకంటూ ఎలాంటి ఫామ్ హౌస్‌లు లేవు. నేను ఏడెనిమిదేళ్లకు లీజుకు తీసుకొని ఆ ఫామ్ హౌస్‌లో ఉంటున్నా. ఆ ఫామ్ హౌస్ కనుక ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉంటే కనుక నేనే స్వయంగా వెళ్లి నా ఫ్రెండ్‌తో మాట్లాడి… దగ్గర ఉండి మరీ కూలగొట్టించి వస్తా. అయితే ఆ ఫామ్ హౌస్ కూల్చేసిన తర్వాత.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో కాంగ్రెస్ మంత్రులు, లీడర్లు కట్టిన నిర్మాణాలను కూడా కూల్చివేయాలి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, మధు యాష్కీల నిర్మాణాలు చాలా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి నిర్మాణం కూడా ఎక్కడ ఉందో చూపిస్తాం,’ అని కేటీఆర్ సవాల్ విసిరారు. మంత్రి పొంగులేటి స్థలం నుంచి కూల్చివేతలను ప్రారంభించాలన్న కేటీఆర్.. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామంటే తనకు ఎలాంటి సమస్యా లేదన్నారు. వీ6 వివేక్ ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ కూడా నీళ్లలోనే ఉందని, అలాంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.