అండర్ 30 జాబితాలో హైదరాబాద్ యువకులకు చోటు
ఫోర్బస్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులకు చోటు లభించింది. మేకర్స్ హైవ్ ఇన్నోవేషన్స్ స్టార్టప్ సీఈవో ప్రణవ్ వెంపటి, డిజీ-ప్రిక్స్ వ్యవస్థాపకుడు సమర్థ్ సింధీ ఉన్నారు. ఆన్లైన్ ఫార్మసీ సేవల స్టార్టప్ డిజీ-ప్రిక్స్ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు మందులను హోమ్ డెలివరీ చేస్తున్నది. వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా పిస్క్రిప్షన్లను అప్లోడ్ చేసిన రోగులకు నెలవారీ మందులను ఉచితంగా సరఫరా చేస్తున్నది. ఈ మందుల ధరలు స్థానిక మార్కెట్ల కంటే 15 శాతం తక్కువగా ఉంటాయి. బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన సమర్థ్ సింధీ, భారత్‌కు తిరిగి రావడానికి ముందు అమెరికన్ హెల్త్‌కేర్ కంపెనీలో పనిచేశారు. మరోవైపు కృత్రిమ అవయవాల తయారీలో నిమగ్నమైన హైవ్ ఇన్నోవేషన్స్ సంస్థ కల్ఆర్మ్ పేరుతో బయోనిక్ హ్యాండ్ను తయారుచేసి చాలా తక్కువ ధరకే అందిస్తున్నది. ఈ కృతిమ చేతితో టైపింగ్ సహా అన్ని పనులు చేయవచ్చు.






