Passport : హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి పురస్కారం

హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు (Passport) కార్యాలయం మరోసారి దేశస్థాయిలో తమ సేవా నిబద్ధతను చాటింది. 2024-25 సంవత్సరానికిగాను వినూత్న సంస్కరణలు, పౌర-కేంద్రీకృత కార్యక్రమాలు అనే క్యాటగిరీ కింద హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి పురస్కారం లభించింది. ఢిల్లీలో నిర్వహిస్తున్న 13వ పాస్‌పోర్ట్ సేవాదివస్‌లో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా (Pabitra Margarita) హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ (Jonnalagadda Snehaja)కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆపరేషనల్ ఎఫిషియెన్సీని కొనసాగిస్తూ దరఖాస్తుల పెండెన్సీని తగ్గించడం, అపాయింట్‌మెంట్ సమయాన్ని మెరుగుపర్చడం, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా చూడడం, ఈ-పాస్‌పోర్ట్ విధానాన్ని అమలుచేయడం తదితర సంస్కరణలను విజయవంతంగా అమలుచేస్తున్నందుకు ఈ గుర్తింపు లభించింది. అలాగే, దరఖాస్తులు త్వరితగతిన పరిశీలించి పాస్‌పోర్టులను వేగంగా అందించడంలో నిరంతరం రాణిస్తున్న రాష్ట్ర పోలీసులను ఈ సందర్భంగా సన్మానించారు. ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బత్తుల శివధర్‌రెడ్డి (Bathula Shivdhar Reddy ) అవార్డు అందుకున్నారు.