Australian University: నైపుణ్య శిక్షణకు ఆస్ట్రేలియా వర్సిటీ : మంత్రి శ్రీధర్‌బాబుతో ప్రతినిధుల చర్చ

రాష్ట్రంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నైపుణ్య శిక్షణ అందించే యూనివర్సిటీ ఏర్పాటుకు ఆస్ట్రేలియా (Australian) వాణిజ్య ప్రతినిధులు ముందుకు వచ్చారని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు (Sridharbabu) తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పుతున్న యంగ్ ఇండియా స్కిల్స్ విశ్వవిద్యాలయాని (Young India Skills University )కి తోడు మరో ఉన్నతస్థాయి టెక్నాలజీ క్యాంపస్ అందుబాటులోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని ఆయన అన్నారు. సచివాలయంలో తనను కలిసిన ఆస్ట్రేలియా ప్రతినిధులతో శ్రీధర్‌బాబు చర్చించారు. కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్నందున గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (Global Capability Center) ( జీసీసీ)లలో పనిచేస్తున్న 3 లక్షల మందికి పైగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల (Software engineers) తో పాటు, చదువులు పూర్తిచేసుకునే విద్యార్థులకు నూతన నైపుణ్యాలపై శిక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తమ యూనివర్సిటీ ద్వారా వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు సృష్టిస్తామని ఆస్ట్రేలియా ప్రతినిధులు చెబుతున్నారు. శాటిలైట్ల నిర్మాణం, డ్రోన్ టెక్నాలజీ, 3-డీ డిజైనింగ్, బయో సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), మెషిన్ లెర్నింగ్ తదితర రంగాల్లో శిక్షణ అందించడానికి ప్రణాళిక సిద్ధం చేశామని వారు చెప్పారు. స్పష్టమైన నిర్దిష్ట ప్రతిపాదనలతో రావాలని వారికి సూచించాం అని శ్రీధర్ బాబు తెలిపారు.