Revanth Reddy: రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన సక్సెస్

తెలంగాణను అన్నీ విధాలుగా అభివృద్ధి చేయడంతోపాటు, పెట్టుబడులను తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఇటీవల జపాన్ (Japan)లో పర్యటించింది. జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి బృందం రూ.12,062 కోట్ల పెట్టుబడులను సాధించగా దాదాపు 30,500 ఉద్యోగాలు సాధించినట్లు పేర్కొన్నారు. జపాన్‌లో పేరెన్నిక గన్న మారుబెని కంపెనీ సీఎం రేవంత్ మానస పుత్రిక ‘ప్యూచర్ సిటీ’లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. వెయ్యి కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించనున్న ఈ సంస్థ భవిష్యత్తులో రూ.5,000 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సంస్థ ద్వారా 30 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఎన్టీటీ డేటా, నెయిసా సంస్థలు హైదరాబాద్‌లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.10,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థ అంగీకారం తెలిపింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సేవల్లో ప్రపంచ ప్రఖ్యాతి గడిరచిన ఎన్టీటీ డేటా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్లౌడ్ ప్లాట్‌పాం సంస్థ నెయిసా నెట్వర్క్స్‌లు సంయుక్తంగా హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందు కొచ్చాయి.
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రూ.10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ను నిర్మించేందుకు త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఎన్టీటీ డేటా, నెయిసా నెట్వర్క్స్ నుంచి బోర్డు సభ్యుడు కెన్ కట్సుయామా, డైరెక్టర్ తడావోకి నిషిమురా ఎన్టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ బాజ్పాయ్ నెయిసా సీఈవో, ఎన్టీటీ గ్లోబల్ డేటా ఛైర్మన్ శరద్ సంఫీు ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్లో 400 మెగావాట్ల సామర్థంతో కూడిన ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ నిర్మితమవుతుంది. 25,000 జీపీయూలతో భారతదేశంలోనే అత్యంత శక్తివం తమైన ఏఐ సూపర్కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను ఈ క్లస్టర్ అందిస్తుంది. తెలంగాణను దేశంలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందుతోంది. తోషిబా ట్రాన్స్ మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా సంస్థ సంగారెడ్డి జిల్లా రుద్రారంలో విద్యుత్ పరికరాలు, సామాగ్రి తయారీ పరిశ్రమను నెల కొల్పనుంది. 562 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని సంస్థ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ బృందానికి హామీ ఇవ్వడంతో పాటు ఇందుకు సంబంధించి అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.
మీ పెట్టుబడులకు మాదే భరోసా
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలో మరొక మైలురాయిగా, జపాన్‌లో జరిగిన వరల్డ్ ఎక్స్‌పో 2025 వేదికగా జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడికి ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఎక్స్‌పో 2025లో ముఖ్యమంత్రి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భాగస్వామిగా పాల్గొంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వారితో సుదీర్ఘంగా చర్చించారు. వరల్డ్ ఎక్స్‌పో 2025లో భారతదేశం నుంచి మొట్టమొదటిగా పాల్గొన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఇది గర్వకారణమని తెలిపారు. తెలంగాణ ` జపాన్ మధ్య ఉన్న చారిత్రక స్నేహ బంధాన్ని దీర్ఘకాలిక భాగస్వామ్యంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్తు ప్రణాళికలను రూపుదిద్దుకునే దిశగా కలిసి పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. సులభతర పారిశ్రామిక విధానం, స్థిరమైన పాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణకు పెట్టుబడులకు ఆకర్షణగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్‌కు రండి, మీ ఉత్పత్తులు ఇక్కడ తయారు చేయండి. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచ దేశాలకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి’’ అంటూ జపాన్ కంపెనీలను ఆహ్వానించారు.
తెలంగాణ-జపాన్ మధ్య ఉన్న మంచి సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ, ఒసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయానికి ఇది నాంది కావచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఒసాకా, అంతర్జాతీయంగా మిగతా భాగస్వాములతో కలసి అద్భుత భవిష్యత్తును నిర్మిద్దామని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో 30,000 ఎకరాల విస్తీర్ణంలో ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. ఇది ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇందులో భాగంగా జపాన్‌కు చెందిన మరుబెని కార్పొరేషన్‌తో కలిసి ఒక ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడిరచారు. హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్ మధ్య ఉన్న జోన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. అంతర్జాతీయ ఎగుమతుల కోసం సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్ట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
మూసీ నది పునరుజ్జీవంలో భాగంగా నది పొడవునా 55 కిలోమీటర్ల అర్బన్ గ్రీన్ వే అభివృద్ధికి జపాన్ నగరాలైన టోక్యో, ఒసాకాల శ్రేష్ఠమైన అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందని గుర్తుచేస్తూ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ రంగాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం రాష్ట్రంలో నెలకొన్నదని వివరించారు.
పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ, నైపుణ్యాల శిక్షణతో పాటు నాణ్యత, క్రమశిక్షణకు అద్దం పట్టేలా ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ’ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది ఉపాధి, వ్యాపార అవకాశాలను రెట్టింపు చేస్తుందన్నారు.
ఫ్యూచర్ సిటీలో ‘మరుబెని’ పార్కు
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేయనున్న మొట్టమొదటి నెక్ట్స్ జెన్ ఇండ్రస్టియల్ పార్కులో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే వారికి తమ ప్రభుత్వం తరఫున మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో అక్కడి వ్యాపార దిగ్గజ సంస్థ ‘మరుబెని’ప్రతినిధులు టోక్యోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అధునాతన వసతులతో కూడిన (నెక్ట్స్ జెన్) పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు ‘మరుబెని’సంసిద్ధత వ్యక్తం చేసింది. 600 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును దశల వారీగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కీలక పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది. పార్కు ఏర్పాటుకు సంబంధించిన ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’పై సీఎం రేవంత్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ‘మరుబెని’ప్రతినిధులు సంతకాలు చేశారు. రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో సంస్థ ఈ ప్రాజెక్టును చేపడుతుంది.
జపాన్‌కు చెందిన కంపెనీలతో పాటు ఇతర బహు ళ జాతి కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా అభివృద్ధి చేసే ఈ పార్కు రూ.5 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై ఈ పార్కు దృష్టి పెడుతుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. తెలంగాణ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని ‘మరుబెని’ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అధికారి దై సకాకురా అభినందించారు. మరుబెని కంపెనీ 65 దేశాల్లో 410 కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాలలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 50 వేలకు పైగా ఉద్యోగులున్నారు.
సోనీ కార్యాలయంలో…
ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ ‘సోనీ’ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బృందంతో సందర్శంచారు.. సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాల గురించి వీరికి కంపెనీ ప్రతినిధులు వివరించారు. సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ ‘క్రంచైరోల్’పై ప్రతినిధులతో జరిగిన చర్చల్లో.. యానిమేషన్, వీఎఫ్‌ఐ, గేమింగ్ రంగాలకు హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ ప్రతినిధి బృందం వివరించింది. ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనే తన ఆలోచనలను ‘క్రంచైరోల్’ ప్రతినిధులతో ముఖ్యమంత్రి పంచుకున్నారు.
‘జైకా’తో చర్చలు
జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఉన్నత స్థాయి యాజమాన్య బృందంతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధుల సమీకరణపై చర్చించారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.24,269 కోట్ల అంచనాలతో చేపట్టనున్న మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం తుది పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమమ్యే వ్యయంలో 48 శాతం అనగా రూ.11,693 కోట్లు రుణంగా ఇవ్వాలని కోరారు. ప్రపంచ పెట్టుబడుల గమ్య స్థానంగా, అత్యంత ఆకర్షణీయమైన నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, టోక్యోతో సమానంగా నగరాన్ని అభివృద్ది చేసే యోచనలో తమ ప్రభుత్వం ఉందని చెప్పారు. మెట్రో రైలు రెండో దశతో పాటు మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించే రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సాయం అందించాలని కోరారు. కాగా జైకా, తెలంగాణ నడుమ అనేక ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని జైకా సీనియర్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ఎకో టౌన్
జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటుంది. కిటాక్యూషు సిటీ మేయర్ కజుహిసా టేకుచితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు అధికారులు భేటీ అయ్యారు. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రమైన నగర మోడల్స్, నదుల పునరుజ్జీవన విధానాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఈఎక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పీ9 ఎల్‌ఎల్సీ, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడిరగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. కిటాక్యూషు మాదిరిగా హైదరాబాద్‌ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడ్డ కిటాక్యూషు నగరం ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఎలా మారిందో మేయర్ టేకుచి వివరించారు. తమ అనుభవాలు, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణతో పంచుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదు అవసరం అని అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. హైదరాబాద్‌లో ఎకో టౌన్ అభివృద్ధి చేయటం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాద కరమై పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా వృద్ధి చెందిందని అన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితో పాటు తమ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన జపాన్ కంపెనీల పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని అన్నారు.
హైదరాబాద్ ` కిటాక్యూషు రెండు నగరాల మధ్య విమాన ప్రయాణ ఏర్పాటు చేయాలనే అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. హైదరాబాద్‌లో జపనీస్ భాషా పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. జపాన్‌లో యువ శక్తి అవసరం ఎక్కువగా ఉందని, మన యువతకు జపనీస్ భాషపై నైపుణ్యం కలిగిస్తే, అంతర్జాతీయంగా వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు.
ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం మురాసాకి పునరుజ్జీవన ప్రాజెక్టును సందర్శించింది. గతంలో కాలుష్య కాసారంగా ఉన్న ఈ నది, పరిశుభ్రమైన నదీతీరంగా మారిన తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్
జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్‌ను ఘనంగా ప్రారంభించింది. జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకుని భారత పెవిలియన్లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒసాకో ఎక్స్పో నిర్వహిస్తారు. ఒసాకో ఎక్స్‌పోలో పాల్గొన్న మన దేశంలోని తొలి రాష్ట్రం తెలంగాణ కావటం విశేషం. ఒసాకా ఎక్స్‌పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు మరియు పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలాల నుంచి వచ్చే సందర్శకులకు చాటిచెప్పనుంది. తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది.