CM Revanth Reddy: ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ భావోద్వేగ ప్రసంగం..!

తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆత్మగౌరవానికి, ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియాలో కొత్తగా నిర్మించిన హాస్టల భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉద్వేగభరితంగా మాట్లాడారు. తెలంగాణ అనే పదానికి ఈ యూనివర్శిటీ ప్రత్యామ్నాయంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన ఈ యూనివర్సిటీ చారిత్రక ప్రాముఖ్యతను తిరిగి ఆవిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 1938లో సాయుధ రైతాంగ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు, ఈ యూనివర్సిటీ ప్రతి సమస్యకూ చర్చా వేదికగా నిలిచిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గిన సమయంలో కూడా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ జ్వాలను ముందుకు తీసుకెళ్లారన్నారు. శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వంటి విద్యార్థులు తెలంగాణ సాధన కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు. ఈ యూనివర్శిటీ గడ్డ దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి వంటి మేధావులను అందించిందని రేవంత్ రెడ్డి చెప్పారు.
అయితే గత పదేళ్లలో ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్ర జరిగినట్లు ముఖ్యమంత్రి ఆరోపించారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చదువు, చైతన్యం ఉన్న వారిని వైస్ ఛాన్సలర్లుగా నియమించినట్లు ఆయన తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచే మేధా సంపత్తిని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
యువత దేశ భవిష్యత్తుకు కీలకమని, 60 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారు ఉన్న దేశంలో యువ నాయకత్వం అవసరమని ముఖ్యమంత్రి చెప్పారు. 21 ఏళ్ల వయసులో ఐఏఎస్ అధికారులు దేశానికి సేవలందిస్తుంటే, యువత శాసనసభల్లో అడుగుపెట్టకూడదా అని ఆయన ప్రశ్నించారు. అయితే గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలు యువతను నిర్వీర్యం చేస్తున్నాయని, వాటి నుంచి యువతను బయటపడేలా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. “చదువు ఒక్కటే మిమ్మల్ని ధనవంతులను, గుణవంతులను చేస్తుంది. పేదరికాన్ని పారద్రోలడం మాకు తెలుసు. మీ తలరాతలు మార్చేది విద్య ఒక్కటే” అని ఆయన నొక్కి చెప్పారు.
యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఇంజనీర్ల కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తామని, దాని చరిత్ర తెలంగాణకు నిలువెత్తు సాక్షిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అభివృద్ధి కోసం అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు ఆర్ట్స్ కాలేజీ వద్ద సమావేశం ఏర్పాటు చేస్తామని, అవసరమైన సౌకర్యాల కోసం అడగాలని ఆయన విద్యార్థులకు సూచించారు. అప్పుడు ఒక్క పోలీస్ కూడా ఇక్కడ కనిపించ వద్దని, ఎవరు ఎలాంటి నిరసనైనా తెలపనీయాలని చెప్పారు.
రాజకీయ కుట్రలు, దుష్ప్రచారాలను ఎదుర్కొంటూ, ప్రభుత్వం సత్యాన్ని నిలబెట్టేందుకు కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం యూనివర్సిటీని దెబ్బతీసే ప్రయత్నం చేసినట్లు ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు కోదండరామ్‌పై కుట్ర చేసి ఆయన ఎమ్మెల్సీ పదవిని తొలగించిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. మళ్లీ పదిహేను రోజుల్లో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎవరు అడ్డొస్తారో చూస్తానన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని విద్యార్థులు నమ్మవద్దని, సమస్యలు ఉంటే నేరుగా తమతో చర్చించాలని ఆయన కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి బాధ్యతను తాను స్వీకరిస్తున్నానని, యువత విద్య, చైతన్యంతో సమాజంలో రాణించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.