CM Revanth Reddy: కిషన్ రెడ్డి వల్లనే తెలంగాణకు ప్రాజెక్టులు రావడం లేదు: సీఎం రేవంత్

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) వల్లనే తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రాజెక్టులు అందడం లేదని, అవి రాకుండా కిషన్ రెడ్డే అడ్డుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి లభించడం లేదని రేవంత్ (CM Revanth Reddy) ఆరోపించారు.
‘‘మీరు ప్రత్యేకంగా తెలంగాణకు తీసుకొచ్చిన ప్రాజెక్టు ఏంటో ఒక్కటి చెప్పండి కిషన్ రెడ్డి గారూ.. నోరు వేసుకొని బెదిరిస్తే భయపడేవారు ఇక్కడెవరూ లేరు. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టులను కిషన్ రెడ్డి (Kishan Reddy) అడ్డుకొంటున్నారు. సబర్మతి సుందరీకరణను ప్రశంసించిన కిషన్ రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మేం ప్రధాని మోదీ వ్యక్తిగత ఆస్తుల్ని అడగడంలేదు. రాష్ట్రం నుంచి కేంద్రానికి భారీగా పన్నులు వెళ్తున్నాయి. తెలంగాణ చెల్లించిన పన్నుల్లో పావలా కూడా రాష్ట్రానికి రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ యూపీ, బిహార్‌లకే ఇస్తోంది’’ అని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విమర్శించారు.
రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏం సాధించారో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘తెలంగాణలో ప్రాజెక్టుల గురించి కేంద్రమంత్రి వర్గంలో ఎప్పుడైనా ప్రస్తావించారా? ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులను మీరు రాష్ట్రానికి తీసుకొచ్చారు? తెలంగాణ కోసం కేంద్రాన్ని ఏం అడిగారో చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు. మీరు రాష్ట్రంలో సైంధవుడి పాత్ర పోషిస్తున్నారు. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఈ ప్రాజెక్టులన్నింటికీ అనుమతులు తీసుకొని హైదరాబాద్‌కు రావాలి. గతంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని కోట్ల మందికి ఇచ్చారో చెప్పండి. తెలంగాణలో కేంద్రం ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పండి. రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి కేంద్రం వందల మందిని బలితీసుకుంది. మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయా అని కిషన్ రెడ్డి (Kishan Reddy) అవహేళన చేస్తున్నారు. మేం ఢిల్లీకి వెళ్లి లిక్కర్ దందాలు చేయడంలేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వెళ్తున్నాం’’ అని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.