రేవంత్ పొలిటికల్ స్టైల్…

రేవంత్ రాజకీయం సొంత పార్టీ నేతలకే కాదు.. విపక్షాలకు అర్థం కాకుండా మారింది.మొన్నటికి మొన్న ప్రధాన మంత్రి మోడీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు .. ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆయనను బడేబాయ్ అంటూ సంబోదించారు. మోడీతో చాలా సన్నిహితంగా మెసలారు. అదెంతగా అంటే స్టేజ్ పై ఉన్న బీజేపీ నేతలు, కేంద్రమంత్రి సైతం ఆశ్చర్యపోయేంతగా.. అంతే కాదు.. మీ పరిపాలన భేష్… మీరు మా తెలంగాణపైనా దయ చూపించండి. మేం సైతం గుజరాత్ లా డెవలప్ అవుతామని విన్నవించుకున్నారు. మోడీ సైతం రేవంత్ తో అంతే సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించారు. వీరి మాటా మంతిని పక్కనే కూర్చున్న గవర్నర్ తమిళిసై సైతం ఆసక్తిగా గమనించారు.
ఎప్పుడైతే మోడీని.. రేవంత్ బడేబాయ్ అన్నారో.. ఇంకేముంది విపక్ష బీఆర్ఎస్.. దీన్ని అస్త్రంగా చేసుకుంది. తెలంగాణలోనూ మరో షిండే తయారు కానున్నాడంటూ సెటైర్లు వేసింది. మోడీకి రేవంత్ రెడ్డి లొంగిపోయాడని.. రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆక్షేపించింది. అయితే దీనికి కాంగ్రెస్ శ్రేణులు,నేతలు సైతం అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి హోదాలో మోడీ వస్తే..గౌరవించకూడదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ విమర్శలకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు. అందుకే ప్రధాని మోడీని బడేబాయ్ అంటూ సంభోదించామన్నారు.
పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధానిమోడీ, బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనకు నిధులు, అవసరమైన అనుమతులు ఇవ్వకపోతే చాకిరేవు పెట్టి చిరిగే దాకా ఉతికే బాధ్యత తీసుకుంటా. ప్రధాని మోడీ రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోతే తెలంగాణే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి ఆయనకు వ్యతిరేకంగా కొట్లాడతానన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్, మోదీ పదేళ్లు అధికారంలో ఉన్నారు. యువకులకు కొలువులు ఇచ్చారా? పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా లభించిందా? కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, సంగంబండ, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యాయా? పరిశ్రమలు ఏర్పాటయ్యాయా? పాలమూరు విశ్వవిద్యాలయానికి నిధులు వచ్చాయా? అని రేవంత్ ప్రశ్నించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మోదీ ప్రధానమంత్రిగా పదేళ్లు ఉండొచ్చు కానీ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, పేదల ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనీయబోమనడం న్యాయమా..? ధర్మమా.. అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘40 శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామని అనడం ప్రజాస్వామ్యానికి, దేశానికి మంచిదా..? విజ్ఞులు, మేధావులు ఆలోచించాలి. దుర్మార్గమైన రాజకీయాలను పాతరేయాలి. మా ప్రభుత్వాన్ని ఎందుకు పడగొడతామంటున్నారు? పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి జాతి’ అంటూ కేసీఆర్, మోదీలపై మండిపడ్డారు. రైతుబిడ్డ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చూసి ఓర్వలేకపోతున్నారా అని ప్రశ్నించారు.
‘పాలమూరు పేదబిడ్డ ఈ రాష్ట్రాన్ని పాలించకూడదా? ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదు. మా జోలికొస్తే అంతు చూస్తాం. పాలమూరు వాళ్లను ఎవరైనా ముట్టుకోండి.. మానవ బాంబులవుతాం’ అని విరుచుకుపడ్డారు. అవసరమైన పక్షంలో కేంద్రంతో సఖ్యతే కాద.. తేడా వస్తే కొట్లాటకు సైతం సిద్ధమంటూ విమర్శకుల నోళ్లు మూయించారు సీఎం రేవంత్ రెడ్డి. అయినా ప్రధాని మోడీతో .. రాష్ట్రప్రభుత్వం సఖ్యతతో ఉంటే.. దాన్ని ఎవరూ పెద్దగా తప్పుపట్టాల్సిన పరిస్థితి లేదు. అనవసరంగా దీన్ని పెద్దగా చేయాల్సిన పనిలేదు. అయితే దీన్ని పెద్ద విషయంగా చేసి, ఓవిధంగా బీఆర్ఎస్… రేవంత్ రెడ్డికి మంచి అవకాశమిచ్చిందనే చెప్పొచ్చు.