బీఆర్ఎస్ నేతలకు చుక్కలు చూపిస్తున్న రేవంత్ రెడ్డి..!!

తెలంగాణలో పదేళ్లపాటు అధికారం చెలాయించింది బీఆర్ఎస్ పార్టీ. పదేళ్లలో తాము చెప్పిందే వేదం అన్నట్టు సాగింది. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వేరే కాంగ్రెస్ నేతలెవరైనా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి ఉంటే కథ వేరేగా ఉండేదేమో.. కానీ రేవంత్ సీఎం పీఠంపై కూర్చోవడంతో బీఆర్ఎస్ నేతలకు వణుకు మొదలైంది. రేవంత్ రెడ్డి సీఎం అని ప్రకటించింది మొదలు యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టేశారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తోంది. అప్పుడే అన్ని రకాలుగా బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడుతున్నారు.
రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తుండగానే మరోవైపు ప్రగతి భవన్ కంచె బద్దలైంది. గడీల పాలనకు స్వస్తి చెప్తామని.. ప్రజా పాలన తీసుకొస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ప్రగతి భవన్ కు ప్రజలను అనుమతించడంతో ప్రజాపాలన మొదలైందని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ప్రతి రోజూ ఏదో ఒక అవినీతినో, అక్రమాన్నో వెలికి తీస్తూనే ఉన్నారు రేవంత్ రెడ్డి. మేడిగడ్డ కుంగడంతో దానిపై విచారణకు ఆదేశించారు. కేసీఆర్ ఇంజినీర్ గా మారి మేడిగడ్డను నిర్మించారని.. అందుకే కుంగిపోయిందని ఎలివేట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడింది.
రేవంత్ రెడ్డి అంతటితో ఆగలేదు. HMDAలో భూఅక్రమాలపై శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఆయన్ను విచారిస్తే మరింత మంది వెలుగులోకి వచ్చారు. గొర్రెల స్కాంపై విచారణ సాగిస్తోంది రేవంత్ సర్కార్. ఇందులో కూడా భారీగా అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించింది. ఇక కేసీఆర్ బంధువులదిగా చెప్పుకుంటున్న లిక్కర్ షాప్ టానిక్ పై సోదాల్లో అనేక ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. ఇక ప్రగతి భవన్ లో కుక్కలషెడ్డుకు లక్షలు ఖర్చు చేయడం, సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టడాన్ని ప్రభుత్వం గుర్తించింది. వీటన్నిటిపైనా విచారణకు ఆదేశించింది.
తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి కాలేజీ భవనాల్లో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో వాటిని పాక్షికంగా కూలగొట్టింది. వెంటనే రేవంత్ రెడ్డి దగ్గరకు కాళ్లబేరానికి వెళ్లారు మల్లారెడ్డి, ఆయన అల్లుడు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డిని కలిశారు. మొత్తానికి రేవంత్ రెడ్డి బీఆర్ఎస నేతలకు వణుకు పుట్టిస్తున్నారు. మున్ముందు ఈ తరహా దాడులు మరిన్ని జరగడం ఖాయమని సమాచారం.