KTR – CM Ramesh: కేటీఆర్‌పై సీఎం రమేశ్ ఘాటు వ్యాఖ్యలు..!!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల అమ్మకం విషయంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ భూములపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ భూముల అమ్మకం వ్యవహారంలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ (BJP MP CM Ramesh), సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సహాయం చేశారన్నారు. అందుకు బదులుగా సీఎం రమేశ్ కు రూ.1600 కోట్ల విలువైన కాంట్రాక్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కట్టబెట్టారని ఆరోపించారు. కేటీఆర్ కామెంట్స్ పై సీఎం రమేశ్ తాజాగా స్పందించారు. కేటీఆర్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ సర్కారు అమ్మకానికి ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ భూములు పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ముఖ్యమైనవని, వీటిని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం సరికాదని విద్యార్థులు, పర్యావరణవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారుపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ భూములను తాకట్టు పెట్టి రూ.10,000 కోట్ల రుణాలు పొందేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ అన్నారు. ఈ ప్రక్రియలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ సహకారం ఉందని, ఆయనకు ప్రతిఫలంగా రూ.1,600 కోట్ల విలువైన ఫ్యూచర్ సిటీ రోడ్డు కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలు బీజేపీ-కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందనే అనుమానాలను రేకెత్తించాయి.
కేటీఆర్ ఆరోపణలపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను పూర్తిగా నిరాధారమైనవని, రేవంత్ రెడ్డిపై బురద జల్లేందుకు కేటీఆర్ తనను పావుగా వాడుకుంటున్నారని ఆయన అన్నారు. తన సంస్థ రిత్విక్ ప్రాజెక్ట్స్ కు రూ.1,600 కోట్ల కాంట్రాక్ట్ లభించిన విషయంలో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. రూ.5లక్షలకు మించి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇవ్వరనే విషయం కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. అంతేకాదు.. కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. “ఆ సమయంలో నన్ను కలిసిన విషయం కేటీఆర్ మర్చిపోయారా?” అని ప్రశ్నించారు. కవితను బయటకు తీసుకొస్తే బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామని చెప్పిన విషయం మర్చిపోయావా అని సీఎం రమేశ్ నిలదీశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి పెద్దలు ఒప్పుకోలేదన్నారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే భయంతో కేటీఆర్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సీఎం రమేశ్ సవాల్ విసిరారు.
ఈ వివాదం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచింది. కేటీఆర్ ఆరోపణలు బీజేపీ-కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందనే అనుమానాలను రేకెత్తించాయి. అయితే ఇప్పుడు సీఎం రమేశ్ ఖండించడంతో బీఆర్ఎస్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.