లాభం లేదు… నేనే స్వయంగా ఆకస్మిక పర్యటనలు చేస్తా : సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

‘‘రెండేళ్లు గడిచిపోయాయి.. ఇక నేను రంగంలోకి దిగక తప్పదు. అలసత్వం వహించిన ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదు. క్షమించేదీ లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం’’ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు హెచ్చరిక. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తీరు, మున్సిపల్, పంచాయతీ రాజ్ సిబ్బంది తీరుపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. సీఎస్ సోమేశ్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్నప్రగతి తీరును, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారుల పనితీరును పరిశీలించేందుకు జూన్ 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలను తానే స్వయంగా చేపడతానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల క్షేత్ర స్థాయి పనితీరును సమీక్షించడానికి జూన్ 13న అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ప్రగతి భవన్‌లో సమావేశం ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు.
ఛార్టులు రూపొందించి, కార్యాచరణ చేయండి : కేసీఆర్
సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలను సిద్ధం చేసుకునే చార్టును రూపొందించుకోవాలని, దానికి అనుగుణంగా ప్రతీ సీజన్లో ముందస్తు కార్యాచరణను చేపట్టే సంస్కృతిని ఆయా శాఖల ప్రభుత్వ యంత్రాంగం అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 1.47 శాతానికి పడిపోయిందని ప్రకటించారు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత, త్వరలో మలి విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడతానని తెలిపారు. అలాగే ఇప్పటి వరకూ గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఎంత వరకు ఏమేమి పనులు జరిగాయో, ఒక చార్టును రూపొందించాలని ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతి చర్యలను వేర్వేరుగా రూపొందించాలని కోరారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, నీటి సరఫరా, గ్రామ సభల తదితర అంశాలను అందులో పొందుపరిచాలని సీఎం కోరారు.
గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో నిర్వహించుకోవడం కన్నా, అంతకు మించిన పని ప్రభుత్వానికి ఏమీ ఉండదని సీఎం వ్యాఖ్యానించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని సంతృప్తి వ్యక్తం చేశారు. పచ్చదనాన్ని పెంచడం అనేది నిరంతర ప్రక్రియ అని, అదనపు కలెక్టర్లను నియమించుకోవడంలో ప్రధాన ఉద్దేశం పల్లెలు, పట్టణాలను బాగు చేసుకోవడానికే అని సీఎం స్పష్టం చేశారు. డీపీఓలు సహా కింది స్థాయి ఉద్యోగలును ఆ దిశగానే నడిపించాలని సూచించారు. వారు చేయాల్సింది చాలా ఉందని, కానీ అనుకున్నంత సాధించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పంచాయతీ రాజ్, మున్సిపల్ మంత్రులు మాత్రమే అన్నీ చేయాలంటే కుదిరే పని కాదని, ప్రజాప్రతినిధులు అందరూ నడుం కట్టాలని, అందరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఇకపై మున్సిపల్ డైరెక్టర్లు, పంచాయతీరాజ్ కమిషనర్లు జిల్లాలు, గ్రామాల్లో పర్యటన చేపట్టాలని, వారు క్షేత్ర స్థాయిలో ప్రజలను కలుసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.