లాకప్ డెత్ పై సమగ్ర విచారణ జరపండి : సీఎం కేసీఆర్

అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో జరిగిన మరియమ్మ లాకప్ డెత్‌పై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాకప్‌డెత్‌కు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని ఆదేశించారు. ఎస్సీ మహిళ లాక్‌ప్ డెత్ జరగడం చాలా బాధాకరమని, కుటుంబీకులను పరామర్శించాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. పేదల పట్ల పోలీసులు తమ దృక్పథాన్ని మార్చుకోవాలని, వారికేమైన అన్యాయాలు జరిగితే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. మరియమ్మ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, కుమారుడికి 15 లక్షలు, కుమార్తెలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.