Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మంచి సంకల్పంతో తలపెట్టిన ఈ భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City) ప్రారంభోత్సవానికి వరుణదేవుడు కూడా సహకరించాడు. చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు.. నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఇక్కడ నాకేదో భూములు ఉన్నాయని.. అందుకే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇది నా కోసమో, నా కుటుంబం కోసమో కాదు.. భవిష్యత్ తరాల భవిష్యత్తు కోసం. ఆనాడు కులీకుతుబ్ షా హైదరాబాద్ నగరానికి అంకురార్పణ చేశారు. నిజాం కాలంలో సికింద్రాబాద్ ను అభివృద్ధి చేశారు.. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్, సిలికాన్ వ్యాలీ అభివృద్ధి జరిగింది. గతం నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది.
మన భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ నగరాలు భారత్ ఫ్యూచర్ సిటీ గురించి చర్చించుకునేలా నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఉండాల్సిన అర్హతలన్నీ భారత్ ఫ్యూచర్ సిటీకి ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీ పట్నం గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే పదేళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలన్నదే మా లక్ష్యం. ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు మీ అందరి సహకారం ఉండాలి.. చిన్నచిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. నేను కూర్చుని మీ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నా. రాజకీయ పార్టీల ఉచ్చులో పడి కోర్టులకు వెళ్లి నష్టపోవద్దు.. తక్షణమే మీ సమస్యలను పరిష్కరించాలని మా అధికారులను ఆదేశిస్తున్న. అందరికీ న్యాయం చేయాలనేదే మా ప్రయత్నం.
డిసెంబర్ నెలలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ భవనం, స్కిల్ యూనివర్సిటీని పూర్తి చేస్తాం. అప్పుడు నెలకు మూడుసార్లు ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తాం. ప్రపంచంలో ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలోనే కూర్చుని మాట్లాడుతా. ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా.. సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఇక్కడ పది ఎకరాలు కేటాయించాలని భట్టి, శ్రీధర్ బాబు కు సూచన చేస్తున్నా. 2026 డిసెంబర్ లోగా ఆ కార్యాలయ నిర్మాణం పూర్తిచేసుకునేలా చూడాలి.