Social Media: భావ ప్రకటన స్వేచ్ఛపై వివాదం.. సోషల్ మీడియా చట్టంపై వెనక్కి తగ్గిన కూటమి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సోషల్ మీడియా (Social Media) విషయంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచుగా వస్తున్న పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలు మంత్రుల పనితీరును, అధికారుల చర్యలను ప్రజల ముందు ఉంచుతున్నాయి. చిన్న తప్పిదం జరిగినా వెంటనే విస్తృతంగా వ్యాపించడం వల్ల ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కార్యకలాపాలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తేవాలనే ఆలోచన మొదట రాష్ట్ర మంత్రివర్గంలో చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు.
వర్షాకాల సమావేశాల్లోనే చట్టం ప్రవేశపెట్టాలని అనుకున్నా, ఆ దిశగా ముందుకు వెళ్లే ప్రయత్నం చివరికి ఆగిపోయింది. ఇందుకు కారణం సీనియర్ అధికారులు ఇచ్చిన సూచనలే. సోషల్ మీడియా అంశం ఐటీ చట్టం పరిధిలోకి వస్తుంది కాబట్టి దానిని పర్యవేక్షించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. రాష్ట్రాలు వేరు చట్టాలు చేసినా అవి అమల్లోకి రావడానికి కేంద్రం ఆమోదం తప్పనిసరి అవుతుంది. అంతేకాకుండా ఇటీవలే కేంద్రం (Central Government) రాష్ట్రాలకు ఇచ్చిన స్పష్టమైన దిశానిర్దేశాల్లో, సోషల్ మీడియాపై ప్రత్యేక చట్టాలను రాష్ట్రాలు తేవద్దని పేర్కొంది.
అదే సమయంలో సుప్రీంకోర్టు (Supreme Court) కూడా సోషల్ మీడియా అనేది వ్యక్తిగత భావప్రకటన స్వేచ్ఛలో భాగమని స్పష్టం చేసింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు మరింత వివాదాస్పదం అవుతాయని అంచనా వేసింది. అంతేకాదు, పొరుగుని దేశం నేపాల్ (Nepal) లో జరిగిన అల్లర్ల వెనుక సోషల్ మీడియా అడ్డంకులు కూడా ఒక కారణమని చెప్పబడటంతో, ప్రభుత్వం ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించింది.
ఇకపోతే, చట్టాన్ని తెచ్చే ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నా, కొన్ని సందర్భాల్లో వ్యక్తులపై కేసులు పెట్టడం, పోలీసుల ద్వారా చర్యలు తీసుకోవడం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) కూడా తీవ్రంగా స్పందిస్తూ, ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. మొత్తం మీద, సోషల్ మీడియాను నేరుగా కట్టడి చేయడం కంటే, అక్కడ వస్తున్న విమర్శలను సమాధానం ఇవ్వడం, సానుకూల దృక్కోణంలో ప్రజలకు సమాచారం చేరవేయడం అనే మార్గం మాత్రమే సర్కారుకు అందుబాటులో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. లేని పోని చట్టాలు తెస్తే అవి ప్రజలలో ప్రతికూలతను మరింత పెంచే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేసింది. అందుకే, సోషల్ మీడియాపై ప్రత్యేక చట్టం జోలికి వెళ్లకూడదనే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.