Adi Srinivas: ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు అందచేసిన చెన్నమనేని రమేశ్

తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas )కు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (Chennamaneni Ramesh) హైకోర్టులో రూ.25 లక్షల డీడీ అందజేశారు. చెన్నమనేని పౌరసత్వం (Chennamaneni Citizenship)పై గతంలో ఆది శ్రీనివాస్ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) లో పిటిషన్ దాఖలు చేశారు. జర్మనీ పౌరసత్వం (German citizenship) కలిగి ఉండి తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారని, ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ అంశంపై కోర్టులో ఆది శ్రీనివాస్ సుదీర్ఘ కాలం పోరాడారు. పలు దఫాలుగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, చెన్నమనేని రమేశ్‌కు జర్మనీ పౌరసత్వం ఉన్నట్లు తేల్చింది. తప్పుదోవ పట్టించినందుకు ఆయనకు జరిమానా విధించింది. పిటిషనర్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, న్యాయసేవాధికార సంస్థకు రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు మేరకు నేడు ఆ డబ్బును డీడీల రూపంలో చెన్నమనేని రమేశ్ అందజేశారు.