Kishan Reddy: కాంగ్రెస్ గత 60 ఏళ్లలో ఎందుకు చేయలేదు : కిషన్ రెడ్డి

బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు.హైదరాబాద్ నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కులగణన (Caste census) జరగలేదని, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ ఊసే ఎత్తలేదని అన్నారు. మండల్ కమిషన్ (Mandal Commission) నివేదికను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టిందన్నారు. హస్తం పార్టీ బీసీలను పక్కకు పెట్టి ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు. 2011 జనగణనలో కులగణన చేర్చాలని సుష్మాస్వరాజ్ ఆనాటి ప్రధానికి లేఖ రాశారు. దేశంలో కులగణన జరిగితే బీసీలకు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఏ సామాజిక వర్గం వెనుకబడి ఉందో గుర్తించవచ్చు. వెనకబడిన వర్గాల వారికి ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు ఉపయోగపడుతుంది. కులగణన నిర్ణయం తమ విజయంగా కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకొంటోంది. అలాంటప్పుడు కాంగ్రెస్ గత 60 ఏళ్లలో ఎందుకు చేయలేదు. ఇది రాహుల్ గాంధీ(Rahul Gandhi), రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కి భయపడి తీసుకున్న నిర్ణయం కాదు. సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉన్నందున కులగణన నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్‌లా ముస్లింలను బీసీల జనాభాలో చేర్చి మోసం చేయం. తెలంగాణ (Telangana), కర్ణాటకలో కులగణనను కాంగ్రెస్ తూతూమంత్రంగా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది నిజమైన కులగణన కాదు అని ఆరోపించారు.