Revanth Reddy : బీఆర్ఎస్ ట్రాప్‌లో సీఎం రేవంత్ రెడ్డి..!?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఏడాది సంబరాలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఏడాదిలో తాము హామీ ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేశామని చెప్పుకుంటోంది. ఇటీవల జాతీయ స్థాయి పత్రికల్లో ఈ మేరకు ప్రకటనలు కూడా ఇచ్చారు. ఆల్ ఈజ్ వెల్ అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. బీఆర్ఎస్ దూకుడు ముందు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడుతోందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ట్రాప్ లో పడుతున్న రేవంత్ రెడ్డి.. దాని నుంచి బయట పడేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే ఫీలింగ్ కలుగుతోంది.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించారు. ఆ పార్టీ అంతు చూసేవరకూ నిద్రపోనని శపథం చేశారు. అందులో భాగంగానే ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ వైపు లాక్కునేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తారని అందరూ అనుకున్నారు. అదే సమయంలో తాము ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత రవాణా, రైతు బంధు.. లాంటి స్కీంలను కూడా త్వరగానే పట్టాలెక్కించేశారు. రేవంత్ రెడ్డి దూకుడు అలా ఉండేది. అయితే రేవంత్ రెడ్డి ఎక్కడో ఒక చోట దొరక్కపోతాడా అని బీఆర్ఎస్ ఎదురు చూసింది.
సరిగ్గా ఈ సమయంలోనే రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టింది. ఒకేసారి అందరికీ రుణమాఫీ చేయకుండా విడతలవారీగా చేయాలని నిర్ణయించింది. సరిగ్గా ఇదే అంశాన్ని బీఆర్ఎస్ లేవనెత్తింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా కాకముందే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించడం మొదలు పెట్టింది. రుణమాఫీపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రభుత్వాన్ని నిలదీసేలా వ్యూహం పన్నింది. మాకు రుణమాఫీ కాలేదంటూ చాలామంది బయటికొచ్చి నోరు విప్పడం మొదలు పెట్టారు. దీంతో ఆ విమర్శల నుంచి బయటపడేందుకు రేవంత్ సర్కార్ రుణమాఫీపై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వచ్చింది.
తాజాగా.. మూసీ నది టెండర్లు, కొడంగల్ లో ఫార్మా కంపెనీ విషయంలోనూ ఇదే స్ట్రాటజీ అమలు చేసింది బీఆర్ఎస్. వాస్తవానికి మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి ప్రభుత్వం ఇంతవరకూ టెండర్లు కూడా ఆహ్వానించలేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఏదో జరగిపోతోందని హడావుడి చేయడం మొదలు పెట్టింది. మూసీ బాధితులకు అండగా నిలవడం స్టార్ట్ చేసింది. వాళ్లకోసం ధర్నాలు చేసింది. తాజాగా కొడంగల్ లో ఫార్మా కంపెనీకి అవసరమైన భూసేకరణకోసం అధికారులు వెళ్లారు. అక్కడ ఇంకా కంపెనీకి సంబంధించి ఎలాంటి పురోగతీ లేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఆ కంపెనీని తన అల్లుడికి కట్టబెట్టేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారంటూ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. అంటే ఏదీ కాకముందే బీఆర్ఎస్ దాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడిపోతున్నట్టు అర్థమవుతోంది. బీఆర్ఎస్ వ్యూహం నుంచి బయటపడేందుకు ఆయన ఎక్కువ శ్రమపడాల్సి వస్తోంది. రేవంత్ రెడ్డి తన స్ట్రాటజీలను మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది.